వారిని గుండెల్లో పెట్టుకుంటాం
సంగారెడ్డి: 'తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతోనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది.. వారి కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటాం.. వారి కాళ్లకు ముళ్లు గుచ్చుకున్నా తమ పంటితో తీస్తాం..' అని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో గురువా రం 52 మంది అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరుల కుటుంబాలకు ఎలాంటి బాధలు లేకుండా చేయడానికి సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. బాధితులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
'నిర్భయ'కు శ్రీకారం
మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నిర్భయ సహాయ కేంద్రాన్ని మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో ఇదే తొలి కేంద్రం. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ఢిల్లీ తరహా నిర్భయ సంఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకోవద్దనే ఉద్దేశంతో ‘షీ’ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు అన్యాయం జరిగితే నేరుగా నిర్భయ కేంద్రాన్ని ఆశ్రయించవచ్చని సూచించారు.