ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి?
సాక్షి, హైదరాబాద్: తన జపాన్ పర్యటన విజయవంతమైందని చంకలు గుద్దుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే నాలుగేళ్లలో జపాన్, సింగపూర్ దేశాల నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయో వివరిస్తూ ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... చంద్రబాబు జపాన్ పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురంలో నిర్మించాలని తలపెట్టిన మొత్తం పదివేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాలకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాలు (ఎంఓయూలు) ఏమైనా ఉంటే వాటిని, జపాన్ ప్రధానమంత్రి ఏవైనా స్పష్టమైన హామీలు ఇచ్చి ఉంటే వాటిని ప్రజలకు వెల్లడించాలని కోరారు. గతంలో చంద్రబాబు పర్యటనలతో ఎన్ని పెట్టుబడులు వచ్చాయో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.