
రెక్కలు తొడిగి...చుక్కల్లోకి...
- భారీగా పెరిగిన కూరగాయల ధరలు
సాక్షి, సిటీబ్యూరో: సుమారు పక్షం రోజుల క్రితం అల్లకల్లోలం సృష్టించిన తుపాన్ భూతం ధరల రూపంలో భాగ్యనగరంపై పడింది. ఇక్కడ సామాన్యుడి వంటింట్లో ధరల మంటను రాజేసింది. తుపాన్ దెబ్బతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులు సగానికి పడిపోయాయి. దీంతో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. స్థానికంగా క్యాబేజీ, క్యారెట్, దోస వంటి కూరగాయలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. మిగతా కూరగాయల కోసం ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల దిగుమతుల పైనే నగర మార్కెట్ ఆధారపడాల్సి వస్తోంది.
అయితే... ఇటీవల తుపాన్‌తో సీమాంధ్రలో కురిసిన వర్షాల వల్ల కూరగాయల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. స్వల్పంగా దక్కిన పంటకు సైతం స్థానికంగా మంచి డిమాండ్ ఉండటంతో నగరానికి దిగుమతి కాని పరిస్థితి ఎదురైంది. డిమాండ్-సరఫరాల మధ్య తీవ్రమైన అంతరం కూరగాయల ధరలపై పడింది. ఇదే అదనుగా బహిరంగ మార్కెట్లో వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఏ కూరగాయల ధర చూసినా రూ.20-60 మధ్య పలుకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రైతుబజార్లలో సైతం ధరల పరిస్థితి అదుపు తప్పింది.
ఇతర ప్రాంతాలపైనే...
సీమాంధ్రలో వర్షాలతో పంటలు దెబ్బతిన గా...ఇక్కడ సకాలంలో వర్షాలు లేక వేసిన పైర్లు ఎండిపోయాయి. బోర్లు, బావుల కింద పంట సాగు కూడా నెల క్రితమే ముగిసింది. ప్రస్తుతం దోస, క్యాబేజీ, క్యారెట్ తప్ప ఇతర కూరగాయలేవీ కానరావడం లేదు. స్థానికంగా దిగుబడి లేకపోవడంతో ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తోంది. కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి పచ్చిమిర్చి సరఫరా అయ్యేది.
బెండ, దొండ, బీర, టమోటా, చిక్కుడు, గోకర, క్యాప్సికం, ఫ్రెంచిబీన్స్, ఆలు, ఉల్లి వంటివి బెంగళూరు, మదనపల్లి. కర్నూలు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కొద్దిపాటి పరిమాణంలో వస్తున్నాయి. తుపాన్ తర్వాత కూరగాయల దిగుమతులు గణనీయంగా తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో వినియోగదారుని ఆదుకోవాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు చేతులెత్తేశారు. వర్షాల వల్ల ఈ పరిస్థితి ఎదురైందని, దిగుమతులు పెరిగితే ధరలు వాటంతట అవే కిందకు దిగి వస్తాయంటూ దాట వేస్తున్నారు.