
'ఖర్చుకు వెనుకాడకుండా కరెంట్ కొనుగోలు'
హైదరాబాద్: విద్యుత్ సమస్యను అధిగమించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్- శాసనసభలో చెప్పారు. ఖర్చుకు వెనుకాడకుండా కరెంట్ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. జూన్ ఇప్పటివరకు విద్యుత్ కొనుగోలుకు రూ. 2532 కోట్లు వెచ్చించామని వెల్లడించారు. తాను చెప్పేవన్నీ వాస్తవమని, అబద్దాలు చెప్పాల్సిన ఖర్మ తనకు లేదన్నారు. రెండు రాష్ట్రాలు కరెంట్ కష్టాలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
రెండు రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 9500 మోగావాట్లు మాత్రమేనని తెలిపారు. సీలేరు కాంప్లెక్స్ లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 725 మెగావాట్లని, ఈ క్షణంలో 329 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కూడా కరెంట్ కొంటోందన్నారు. ఆంధ్రాలో విలీనమైన ఏడు మండలాలకు కూడా తామే కరెంట్ ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. బేషజాలకు పోకుండా విద్యుత్ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వానికి సహకరిస్తామన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలను కేసీఆర్ ఆహ్వానించారు.