
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌ను నివారించేందుకు భారత్ బయోటెక్ కంపెనీ ఓ వినూత్నమైన టీకాను అభివృద్ధి చేస్తోంది. ముక్కు ద్వారా ఒక చుక్క మందు వేసుకోవడం ద్వారా పనిచేసే ఈ టీకాపై మొదటి, రెండో దశ మానవ ప్రయోగాలు కూడా పూర్తయినట్లు భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో తెలిపింది. కోరోఫ్లూ అని పిలుస్తున్న ఈ టీకాను తాము విస్కాన్సిన్ మాడిసన్ యూనివర్సిటీ, ఫ్లూజెన్ అనే వ్యాక్సిన్ కంపెనీలతో కలసి అభివృద్ధి చేస్తున్నామంది. ఫ్లూజెన్ కంపెనీ ఎం2ఎస్‌ఆర్ ఇన్‌ప్లుయెంజా వైరస్ ఆధారంగా కోరోఫ్లూ తయారైందని వెల్లడించారు.
ఈ టీకా రోగ నిరోధక వ్యవస్థలో స్పందన కలుగచేస్తుందని చెప్పారు. కరోనా వ్యాధి కారక వైరస్ జన్యు పదార్థాన్ని ఎం2ఎస్‌ఆర్‌లోకి జొప్పించి కొత్త వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. భారత్ బయోటెక్ ఈ టీకాను అభివృద్ధి చేయడం, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం వంటి అన్ని బాధ్యతలు చేపడుతుందని, దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు వీలుగా 30 కోట్ల టీకాలను సిద్ధం చేస్తామని డాక్టర్ రాచెస్ ఎల్లా తెలిపారు. ఫ్లూజెన్ తయారీ పద్ధతులతో భారత్ బయోటెక్‌లో టీకాలు సిద్ధం చేస్తామన్నారు.
ఆరు నెలలు పరీక్షలు..
కోరోఫ్లూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంతో పాటు జంతువులపై పరీక్షలు జరిపేందుకు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్‌లో మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత భారత్ బయోటెక్ హైదరాబాద్ కేంద్రం మనుషుల్లో టీకా సామర్థ్యం, భద్రతలపై పరీక్షలు మొదలుపెడుతుందని డాక్టర్ రాచెస్ ఎల్లా తెలిపారు. ఈ ఏడాది చివరి వరకు కోరోఫ్లూ క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి. ఎం2ఎస్‌ఆర్‌పై ఇప్పటికే నాలుగు ఫేస్–1, ఫేస్–2 క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయని, వందలాది మందిపై జరిగిన ఈ ప్రయోగాల ద్వారా టీకా సురక్షితమేనని స్పష్టమైందని చెప్పారు.
కోరోఫ్లూ జలుబు కారక వైరస్ యాంటీజెన్‌లను కూడా ఉత్పత్తి చేస్తుందని ఫలితంగా ఈ టీకా ద్వారా అటు కరోనా వైరస్‌కు, ఇటు ఇన్‌ప్లుయెంజా వైరస్‌కు ప్రతిగా రోగ నిరోధక వ్యవస్థ పనిచేస్తుందని ఫ్లూజెన్ సహ వ్యవస్థాపకుడైన గాబ్రియెల్ న్యూమన్ తెలిపారు. ముక్కు ద్వారా కోరోఫ్లూను అందించడం వల్ల కరోనా, ఇన్‌ప్లుయెంజా వైరస్‌లు సహజసిద్ధంగా శరీరంలోకి ప్రవేశించే దారిలోనే మందు అందుబాటులోకి వస్తుందని ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థ పలు రకాలుగా స్పందిస్తుందని వివరించారు.