‘జూరాల’లో నలుగురి మునక
- ఒకరి మృతదేహం లభ్యం
- లభించని ముగ్గురి ఆచూకీ
ధరూరు, న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల రిజర్వాయర్‌లో నలుగురు మునిగి పోయారు. స్థానికులు, బాధితులు కథనం మేరకు.. హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతానికి చెందిన కుటుంబం గద్వాలలోని శేరెల్లివీధికి చెందిన మహిమూదా ఇంటికి శనివారం వచ్చింది. రాత్రి గద్వాలలోనే ఉండి ఆదివారం ఉదయం ఆత్మకూరులోని బంధువులను చూసేందుకు జీపులో వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో గద్వాలకు తిరుగు పయనమయ్యారు.
మార్గమధ్యంలోని జూరాల ప్రాజెక్టును చూసి అక్కడే కొద్దిసేపు గడిపి వెళ్దామని ఆగారు. వేసవి కావడం, ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా తగ్గి ఉండడంతో వారు కుడికాల్వకు నీటిని విడుదల చేసే రెగ్యులేటరీ వద్దకు చేరుకున్నారు. అక్కడ నీళ్లలో ఆడుకుంటున్న హైదరాబాద్‌కు చెందిన షాకీర్ (17) మునిగిపోయాడు.
గమనించిన తోటివారు సాబేర్ (20), మోసిన్ (19)తో పాటు గద్వాల పట్టణానికి చెందిన వారి బంధువుల అబ్బాయి సమీర్ (19) షాకీర్‌ను కాపాడబోయి ఒకరివెంట మరొకరు ఐదుగురూ నీటిలో మునిగిపోయారు. జుబేర్‌ను జాలర్లు కాపాడారు. రిజర్వాయర్‌లో ఒండ్రుమట్టి పేరుకుపోవడంతో పాటు యువకులకు ఈత రాకపోవడంతో నీట మునిగిపోయారు. ఆదివారం రాత్రి వరకు షాకీర్ ఒక్కరి మృతదే హమే లభించింది. మిగిలిన ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఒకే కుటుంబంలో ఇద్దరు..
జూబ్లీహిల్స్/ఎర్రగడ్డ, న్యూస్‌లైన్: నీళ్లలోకి దిగి గల్లంతైన యువకుల ఉదం తం స్థానికంగా విషాదం నింపింది. బోరబండ సైట్-1కి చెందిన మహమ్మద్ కుమారులు సాబేర్, షాకిర్ పదో తరగతి పూర్తి చేశారు. షాకిర్ అమీర్‌పేటలోని చెప్పుల దుకాణంలో పనిచేస్తుండగా, సాబేర్ ఇంటి దగ్గరే ఉంటూ చిన్నా చితకా పనులు చేస్తూ కుటుంబానికి సహాయపడుతున్నాడు.
అదే ప్రాంతంలో ఉండే వీరి సమీప బంధువు మోసిన్ (19) కూడా చెప్పుల షాపులో పనిచేస్తున్నాడు. వీరు ముగ్గురూ కలిసి శనివారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో ఉండే పెదనాన్న ఇంటికి వెళ్లారు. ఆదివారం ఈత కొట్టడానికని సమీపంలోని జూరాల ప్రాజెక్టుకు వెళ్లి గల్లంతయ్యారు. వీరి తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన గద్వాల బయలుదేరి వెళ్లారు.