
తెలంగాణలో మందకృష్ణ సినిమా క్లోజ్
చెల్లని నాణెంలాంటి వ్యక్తి
ఎస్సీ కార్పొరేషన్ చెర్మైన్ పిడమర్తి రవి
మహబూబాబాద్ : తెలంగాణలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సినిమా క్లోజ్ అయ్యిందని, చెల్లని నాణెంలాంటి వ్యక్తి అని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని పక్కకు పెట్టి టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రి వర్గంలో మాల, మాదిగలకు అవకాశం కల్పించాలని ఎజెండాగా పెట్టుకుని ముందుకు పోవడం సరికాదన్నారు. మందకృష్ణ మాదిగ జిమ్మిక్కులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
మాల, మాదిగలకు సీఎం కేసీఆర్ వ్యతిరేకం కాదన్నారు. చెరుకు సుధాకర్, విమలక్క, శంకర్‌రావు విషయంలో మందకృష్ణ మాదిగ ఎన్నో జిమ్మిక్కులు చేశారన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందన్నారు. అభివృద్దే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారన్నారు.కేయూ జేఏసీ చెర్మైన్ వీరేందర్, కన్వీనర్ మధూకర్, పలు సంఘాల నాయకులు భాస్కర్ నాయక్, నీలేష్ రాయి, స్వామి నాయక్, నరేష్, ఇనుగుర్తి సుధాకర్, దర్శనం రామకృష్ణ, దార్ల శివరాజ్, పొన్నాల యుగేంధర్ తదితరులు పాల్గొన్నారు.