
నాటి దేవరకొండ జెడ్పీటీసీలే.. నేటి ఎంపీ.. ఎమ్మెల్యే
దేవరకొండ జెడ్పీటీసీ సభ్యులుగా విజయం సాధించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి నేడు నల్లగొండ ఎంపీగా కొనసాగుతుండగా, బాలూనాయక్ దేవరకొండ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గుత్తా 1995లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో దేవరకొండ నుంచి విజయం సాధించారు. బాలూనాయక్ ఇదే స్థానం నుంచి 2001లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు.
కీలక పదవుల్లో ఉండి జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఎంపీ గుత్తా సుఖేం దర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాలూనాయక్‌లకు రాజకీయ భవిష్యత్‌నిచ్చింది దేవరకొండ అనే విషయం అక్షర సత్యం. రాజకీయ అరంగేట్రంతోనే ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలైనప్పటికీ ఆ తర్వాత అక్కడి ప్రజలు వారిని అక్కున చేర్చుకున్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో భుజాలకెత్తుకున్నారు. నాటి నుంచి వెనుదిరిగి చూడకుండా ఆ ఇద్దరి నేతలు తమ రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నార
కంచుకోటలో పాగా వేసిన బాలూనాయక్
దేవరకొండ మండలం ముదిగొండ గ్రామానికి చెందిన నేనావత్ బాలూనాయక్ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో ఎంపీటీసీ సభ్యుడిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఓటమితో కుంగిపోకుండా 2001లో జరిగిన ఎన్నికల్లో జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసి విజయం సాధించారు. 2006 వరకు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం 2009 వరకు దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి అప్పటి వరకు సీపీఐకి కంచుకోటగా ఉన్న దేవరకొండలో పాగా వేశారు. ఐదేళ్ల పాలనలో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. తద్వారా తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు.
గల్లీ నుంచి ఢిల్లీకి ‘గుత్తా’
జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒకప్పుడు స్వగ్రామంలో వార్డు సభ్యుడిగా పోటీ చేసి ఓటమి పాలైనవ్యక్తే. ఓటమి విజయానికి నాం దిగా భావించి ఆ తర్వాత 1995లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో దేవరకొండ స్థానం నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. అనంతరం ఏపీ మదర్ డెయిరీ చైర్మనగా ఎంపికయ్యారు. 1999 సార్వత్రిక ఎన్నిక ల్లో తెలుగుదేశం పార్టీ నుంచి నల్లగొండ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. తిరిగి 2009 ఎన్నికల్లో మిర్యాలగూడ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన విషయంలో పార్లమెంటులో తన వాణిని గట్టిగా వినిపించి తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షించారు. తనకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన దేవరకొండ అంటే ఎంతో మక్కువని తరుచూ వ్యాఖ్యానిస్తుండటం ఈ ప్రాంతంపై, ఇక్కడి ప్రజలపై ఆయనకున్న అభిమానాన్ని తెలియజేస్తోంది.