పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయండి
ఆదిలాబాద్ అర్బన్ : ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేయడానికి జిల్లాలోని అన్నీ మార్కెట్ యార్డుల్లో ఏర్పాట్లు చేయాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పత్తి కొనుగోళ్లకు సంబంధించి వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు ఎస్పీ పనసారెడ్డి, ఎంపీ గోడం నగేశ్, నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్, ఆర్డీవోలు అరుణశ్రీ, సుధాకర్‌రెడ్డి, జేడీఏ రోజ్‌లీల, రైతు సంఘం నాయకులు గోవర్ధన్, ముడుపు ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, కమీషన్ ఏజెంట్లు, జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లుల యజమానులు, అఖిలపక్షం, రైతు సంఘం ప్రతినిధులు హాజరయ్యారు.
మరో నెలరోజుల్లో పత్తి సీజన్ ప్రారంభం కానుండడంతో రైతులే నేరుగా మార్కెట్ యార్డుల్లో పత్తి విక్రయించేందుకు ప్రభుత్వం కల్పించాల్సిన ఏర్పాట్లు, మద్దతు ధర తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో మంత్రి రామన్న మాట్లాడుతూ పత్తికి మద్దతు ధరను ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ప్రకటిస్తుందని పేర్కొన్నారు. రైతుల నుంచి పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. అన్ని మార్కె ట్ యార్డుల్లో తూనికల యంత్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 12 శాతం వరకు తేమ కలిగిన పత్తిని కొనాలని చెప్పారు. ప్రతీ రోజు పత్తి ధరల వివరాలను బోర్డులపై నమోదు చేయాలన్నారు.
తేమశాతం, కొనుగోళ్ల తీరుపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేసి, పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ప్రతీ మార్కెట్‌ను అధికారులు సందర్శించాలన్నారు. ఒక రోజు మంత్రి, మరో రోజు ఎంపీ, ఇంకో రోజు కలెక్టర్ ఇలా.. నిరంతరం మార్కెట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. పంట ఇంటికి చేరినప్పటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలన్నారు. సీసీఐ ద్వారా అధిక మొత్తంలో కొనుగోలు చేయాలని చెప్పారు.
మద్దతు ధర కల్పించాలి.. : ఎమ్మెల్యే
సమావేశంలో ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్‌లో పత్తి రైతులు రెండు సార్లు విత్తనాలు విత్తుకున్నారని, పత్తికి మద్దతు ధర కల్పిం చాల్సిందేనని అన్నారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ రైతుల సమస్యలు, ఇతర వివరాలు తెలిపేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తామన్నారు. సిబ్బందిని అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్‌శాఖ అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని మార్కెట్లను కంప్యూటరైజ్డ్ చేశామన్నారు.
మార్కెట్లలో అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. సీసీఐ మేనేజర్ అర్జున్ ధవే మాట్లాడుతూ జిల్లాలో 20 కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు సంబంధించి బ్యాంకు ఖాతా నంబర్, పాసుపుస్తకం జిరాక్స్ కాపీలు అందించాలని, కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులు రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. రైతు సంఘం నాయకుడు గోవర్ధన్ మాట్లాడుతూ పత్తి రైతులకు బీమా సౌకర్యం కల్పించాలన్నారు. గ్రామాల్లో రోడ్లు సరిగా లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, రైల్వే క్రాసింగ్‌ల వద్ద బ్రిడ్జీలు నిర్మించాలని రైతు సంఘం నాయకులు కోరారు.