గోప్లాపూర్‌లో రైతుకు పట్టాబుక్కు, చెక్కు అందిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
పెంట్లవెల్లి (కొల్లాపూర్) : ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.4వేల చొప్పున అందించడం చరిత్రాత్మక నిర్ణయం.. ఇక నుంచి చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడికి ఢోకా లేదు. విత్తనాలు, పనిముట్లు, ఉచిత విద్యుత్, మద్దతు ధర అందించి అన్ని రకాలా ఆదుకుంటామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండలంలోని గోప్లాపూర్ గ్రామంలో మంత్రి రైతు బంధు పథకం కింద చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ప్రతి ఏడాది ఎరువుల కోసం ఎవరినీ అప్పు అడగకుండా ఎకరాకు రూ.4వేల చొప్పున చెక్కులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రోహిణి కార్తె కంటే ముందే చెక్కులను అందజేస్తున్నామని, రైతులు పొలాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎంతో ఉపయోగ పడేలా ఈ పథకాన్ని తీసుకొచ్చిందని, యాసంగి పంటలో కూడా రైతులకు పరిహారం ఇస్తామన్నారు.
బంగారు తెలంగాణకు అడుగులు
రైతులతోనే బంగారు తెలంగాణకు బాటలు పడ్డాయని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుని కొత్త ప్రాజెక్టులు కట్టి జిల్లాను సస్యశ్యామం చేస్తామని మంత్రి అన్నారు. 60 ఏళ్ల చరిత్రలో ఏ ప్రభుత్వం చేపట్టలేని పనిని తెలంగాణ ప్రభుత్వం చేసి చూపిందరన్నారు. ఒకప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు వస్తే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయని, ఇప్పుడు 24గంటలూ కరెంట్ ఉంటుందన్నారు. ఇంతకు ముందు రైతులు ఎరువుల కోసం క్యూలో నిల్చునే వారని, ఇప్పుడు గోదాంలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అందజేస్తున్నామని తెలిపారు.
ఆసరా పింఛన్లను 200 నుంచి వెయ్యికి పెంచామని, పేదలు ఇబ్బంది పడరాదని రూ.లక్షా 116 కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేస్తున్నామని గుర్తుచేశారు. గర్భిణులకు రూ.14వేలు, కేసీఆర్ కిట్ అందిస్తున్నామని, త్వరలో ఇంటింటికి ఫిల్టర్ వాటర్ అందిస్తామని, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇస్తామని, గతంలో ఎన్నడూ లేనట్లుగా ప్రతి వీధిలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేయించడం జరిగిందన్నారు. పిల్లల చదువుల కోసం గురుకుల, నవోదయ, మాడల్ పాఠశాలలను ప్రారంభించామని అన్నారు.
కార్యక్రమంలో జెడ్పీటీసీ లోకారెడ్డి, సర్పంచ్ శైలజ, మాజీ ఎంపీపీ గోవింద్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు రాజేష్, సింగిల్‌విండో చైర్మన్ ఖాజామైనొద్దీన్, ఎంపీటీసీ సుజాత, తహసీల్దార్ వెంకటరమణ, వ్యవసాయాధికారి కె.నరేష్, సింగిల్‌విండో చైర్మన్ ఖాజామైనొద్దీన్, ప్రభాకర్‌రెడ్డి, జ్యోతి, వెంకటమ్మ, వెంకట నర్సింహారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment