క్లాస్‌లో టీచర్లు ఫోన్ మాట్లాడితే సస్పెన్షనే!
వీడియో తీసి పంపండి.. చర్యలు తీసుకుంటా: మంత్రి కడియం
తొర్రూరు(పాలకుర్తి): ఉపాధ్యాయులు తరగతిలో ఫోన్ మాట్లాడితే సస్పెండ్ చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హెచ్చరించారు. గురువారం మహబూబాబాద్‌లోని తొర్రూరు డివిజన్ కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించారు.
కడియం మాట్లాడుతూ క్లాస్‌లో ఫోన్ మాట్లాడే దృశ్యాలను వీడియోగానీ, ఫొటోగానీ తీసి పంపితే చర్యలు తీసుకుంటానన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణంలో రూ.12 వేల కోట్ల నిధులను ఖర్చు పెడుతూ వందలాది గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని, అన్ని సౌకర్యాలతో విద్యా ప్రమాణాలు పెంచి జాతీయస్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో రాష్ట్ర విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పోటీపడేలా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి, కలెక్టర్ ప్రీతి మీనా, డీఈవో శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.