
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ సామాజిక మాధ్యమాల్లో సరదా సంభాషణలు, ఛలోక్తులు చక్కర్లు కొడుతున్నాయి. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ఆయన సోదరి, మాజీ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలు తాజాగా సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌లో నవ్వులు పూయిస్తున్నాయి. ‘కేటీఆర్ సర్.. నాదో వినయపూర్వక ప్రశ్న. 20వ తేదీకి ముందే క్షౌరశాలలు (సెలూన్లు) తెరిపించే ఉద్దేశమేదైనా ఉందా? మా ఆవిడ నా జుత్తు కత్తిరించేందుకు తొందర పడుతోంది.
అదే జరిగితే లాక్‌డౌన్ ఎత్తివేసినా నేను ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది’అని శరత్ చంద్ర అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ ‘జుత్తు కత్తిరించేందుకు విరాట్ కోహ్లి అంతటి వాడే ఆయన భార్యకు అవకాశం ఇచ్చినప్పుడు.. నువ్వు మాత్రం ఎందుకు చేయించుకోకూడదు’అని సమాధానం ఇచ్చారు. దీనికి కేటీఆర్ సోదరి కవిత స్పందిస్తూ ‘అన్నయ్యా.. అయితే నువ్వు కూడా వదినమ్మకు అవకాశం ఇస్తున్నవా?’అంటూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment