సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేని విజయాలు అందించేందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ పట్టుదలగా కనిపిస్తున్నారు. పన్నెండు నియోజకవర్గాల్లో పది చోట్ల అభ్యర్థులను ప్రకటించిన ఆయన వారిని నిద్రపోనీయడం లేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రచార సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అభ్యర్థులను ఉత్సాహ పరుస్తున్నారని, ప్రతి రోజూ దాదాపు అందరితో మాట్లాడుతున్నారని సమాచారం. ఎవరేం చేస్తున్నారు..? ఏ నియోజకవర్గంలో ప్ర చారం జోరుగా సాగుతోంది..? అభ్యర్థులకు మద్దతుగా ఎవరెవరు ప్రచారంలో పాల్గొంటున్నారు..? పార్టీకి వస్తు న్న ఆదరణ ఎలా ఉంది..? అభ్యర్థులను ప్రజలు ఎలా స్వాగతిస్తున్నారు..?
ఎక్కడెక్కడ అడ్డుకుంటున్నారు..? ఆ అసంతృప్తుల నుంచి, ప్రజల నిరసనలనుంచి అభ్యర్థులు ఎలా బయట పడుతున్నారు.. వంటి తదితర సమాచారాన్ని తెప్పించుకుంటున్న కేసీఆర్ వీరిని నిత్యం అప్రమత్తం చేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘ప్రజల్లోనే ఉండండి.. ప్రచా రంలో ఎలాంటి గ్యాప్ ఇవ్వొద్దు. ఇంకా బాగా జనంలోకి వెళ్లి ప్రచారం చేయండి. గెలుపు మీదే..’ అని టీఆర్‌ఎస్ బాస్ కేసీఆర్ ఆ పార్టీ అభ్యర్థులను ఉత్సాహ పరుస్తున్నారని చెబుతున్నారు.
జోరుగా ప్రచారం
గత నెల 6వ తేదీన టీఆర్‌ఎస్ తన అభ్యర్థులను ప్రకటించింది. జిల్లాలో ఇంకా హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో మాత్రమే ఖరారు చేయాల్సింది. ఈ రెండు స్థానాలను మినహాయిస్తే, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో ప్రచారం జోరందుకుంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ఇబ్బందిగా మారిని అసమ్మతి కుంపట్లపైనా అధినాయకత్వం నీళ్లు చల్లింది. కొన్నిచోట్ల అసమ్మతి నేతలకు, అభ్యర్థులకు చేతులు కలిపించింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అన్ని వర్గాలు కలిసి ప్రచారంలో పాల్గొంటున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకటీ రెండు నియోజకవర్గాల్లో ప్రచారంలో అభ్యర్థులకు కొంత వ్యతిరేకత వచ్చినా, ఆ నిరసనలు ప్రజల నుంచి కాకుండా ప్రతిపక్ష పార్టీలు తమకు పట్టున్న గ్రామాల్లో చేసిన కార్యక్రమాలని తేలడంతో వారు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం పది నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పరిస్థితిని పార్టీకి అనుకూలంగా మార్చేందుకు జిల్లా నాయకత్వం చొరవ తీసుకుంది. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డి ఇతర నేతలంతా కలిసి ఆ నియోజకవర్గంలో అన్ని వర్గాల నాయకులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి హాలియాలో సమావేశం ఏర్పాటు చేశారు. నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాల్లో అభ్యర్థులు వేముల వీరేశం, కంచర్ల భూపాల్‌రెడ్డి ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. గడిచిన వారం పది రోజులుగా నకిరేకల్‌లో ఈ తరహా ప్రచారం జరుగుతుండగా, నాలుగు రోజులుగా నల్లగొండలోనూ కంచర్ల ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.
అధినేతతో ప్రత్యేక భేటీ
టీఆర్‌ఎస్ అభ్యర్థులు అందరితో ముఖాముఖి సంభాషించేందుకు అధినేత కేసీఆర్ వీరందరితో ఆదివారం హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరు అభ్యర్థులకు ఉద్దేశించిన సమావేశం అయినా.. ఇందులో ప్రచార వ్యూహం గురించి చర్చిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో కేసీఆర్ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా ప్రచారం తీరుతెన్నుల గురించి వాకబు చేస్తూనే.. నేరుగా అభ్యర్థులతో ముఖా ముఖి సమావేశం కావాలని నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎక్కడెక్కడ లోటు పాట్లు ఉన్నాయి..? ఎవరెవరు ఇంకా సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంది..? ప్రచారం వ్యూహం తదితర అంశాలపై ఆయన అభ్యర్థులకు ఈ భేటీలో మార్గనిర్దేశం చేస్తారని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment