అడవిలో కారు ప్రయాణం
ఏజెన్సీ ఏరియా మీదుగా వరంగల్‌కు సీఎం
సాక్షిప్రతినిధి, వరంగల్: గతంలో ఏ సీఎం చేయని విధంగా దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్ వరంగల్‌కు వచ్చారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న అనంతరం మణుగూరు మీదుగా ముఖ్యమంత్రి వాహనశ్రేణి రోడ్డు మార్గం లో వరంగల్ జిల్లాలోకి ప్రవేశించింది. మణుగూరు నుంచి మహబూబాబాద్, నర్సంపేట మీదుగా వరంగల్‌కు రా వాలని ముందుగా అధికారులు రోడ్‌మ్యాప్ నిర్ణయించారు.
ఆఖరు నిమిషయంలో ఈ రూట్ మారింది. కేసీఆర్ వాహనశ్రేణి మణుగూరు నుంచి బయలుదేరగానే మణుగూరు-మంగపేట-ఏటూరునాగారం-వరంగల్ రహదారిలో 100 కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రైవేటు వాహనాలను రోడ్డుపైకి రానివ్వలేదు. సీఎం కాన్వాయి ప్రధాన రహదారిపై వస్తున్న క్రమంలో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, శ్రేణులు కాన్వాయ్‌ను ఆపేందుకు ప్రయత్నించగా, పోలీసులు అనుమతించలేదు. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా పేరుగాంచిన ఏటూరునాగారం, ములుగు ఏజెన్సీలో గంటా ఇరవై నిమిషాల పాటు ప్రయాణించారు.