కళ్లల్లో నీళ్లు ఆగలే!
* అనాథ పిల్లల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఉద్వేగం
* వారి బాగోగులు ప్రభుత్వమే చూసుకుంటుంది
* యాదాద్రిలో మొదటి స్కూల్ శంకుస్థాపనకు రాష్ట్రపతిని ఆహ్వానించాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ‘గజ్వేలు నియోజకవర్గంలో ఓ కార్యక్రమానికి వెళ్లాను. అక్కడో ఇద్దరు అమ్మాయిలు గణితంలో ఏది అడిగినా టకటకా సమాధానాలిచ్చారు. అబాకస్‌లో అద్భుత ప్రతిభ కనబరిచారు. కార్యక్రమం ముగిశాక వాళ్లిద్దరు నన్ను కలిశారు. వాళ్లిద్దరూ నా దగ్గరికొచ్చి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టారు. ‘సార్ మేము పదో తరగతి చదువుకుంటున్నాం. తర్వాత ఏమి చేయాలో తెలియడం లేదు. మేము అనాథలం. మాకెవరూ లేరు సార్’ అన్నారు. మేము అనాథలం అనే మాట ఆ చిన్నారుల నోటి నుంచి రావడంతో నాకు దుఃఖం వచ్చింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. బాగుండదని ఏడుపు ఆపుకొన్నా. ఇప్పటికీ ఆ పిల్లలు నా కళ్లల్లో మెదులుతున్నారు.
అనాథలమని చెప్పుకొనే స్థితి రావడం నా మనసును కలిచివేసింది’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఉద్వేగంగా మాట్లాడారు. మంగళవారం అనాథ పిల్లల చదువు, వసతి తదితర అంశాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో అనాథ పిల్లలకు ప్రభుత్వమే అమ్మ, నాన్న అవుతుం దని కేసీఆర్ అన్నారు. లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకుంటున్న రాష్ట్రంలో అనాథ పిల్లలను ఆదుకోవడానికి ఏమీ చేయలేమా? ఎన్ని స్వచ్ఛంద సంస్థలు అనాథల కోసం కృషి చేస్తున్నా సరిపోవడం లేదని ఆయన అన్నారు. అందుకే పదో తరగతి తర్వాత రోడ్డున పడుతున్న వారిని ప్రభుత్వమే ఆదరిస్తుందని స్పష్టం చేశారు.
యాదాద్రిలో మొదటి స్కూల్
పదో తరగతి తర్వాత అనాథ పిల్లలకు ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు తెరవాలని అధికారులకు సీఎం సూచించారు. మొదటి రెసిడెన్షియల్ స్కూల్‌ను యాదగిరిగుట్టలో ప్రారంభించాలని, ఈ స్కూల్ శంకుస్థాపనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చెప్పారు. అనాథ పిల్లల భవిష్యత్తుకు ఏం చేయాలనే అంశాలను అధ్యయనం చేసేందుకు నియమించిన మంత్రివర్గ ఉప సంఘం వీలైనంత తొందరగా నివేదిక ఇవ్వాలని సూచించారు. అనాథ పిల్లలకు బంగారు భవితను అందించేందుకు అవసరమైన విధానం రూపొందించాలని ఆదేశించారు. అనాథలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. త్వరలోనే కొన్ని అనాథశ్రమాలు సందర్శించి వారి స్థితిగతులు తెలుసుకుంటానని వెల్లడించారు. మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, కె.తారకరామారావు, లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు