ఎస్సీ వర్గీకరణపై హస్తినకు...
అఖిలపక్ష నేతలను ఆహ్వానించిన సీఎం కేసీఆర్
- ఈ నెల 6న ప్రధానమంత్రిని కలవాలని నిర్ణయం
- ఓయూ శతాబ్ది ఉత్సవాలకు మోదీ, రాష్ట్రపతిని ఆహ్వానించనున్న సీఎం
- ప్రభుత్వ ‘అఖిలపక్ష’ నిర్ణయాన్ని స్వాగతించిన మంద కృష్ణమాదిగ
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో అఖిలపక్ష బృందం ఈ నెల 6న ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలవనుంది. ఈ నెల 5న ఢిల్లీకి రావాల్సిందిగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం లేఖ రాశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, టీడీపీ అధ్యక్షుడు రమణ, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి ఆహ్వానం పంపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని సీఎం ప్రకటించటం తెలిసిందే.
కొంతకాలంగా ఎస్సీలు ఉప కులాల వర్గీకరణకు డిమాండ్ చేస్తున్నారు. మాదిగ ఉప కులాలు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయాయని, ఎస్సీలను ఏ, బీ, సీ, డీగా వర్గీకరించి వాటికి అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు. ఇది రాజ్యాంగ సవరణతో ముడిపడిన అంశం కావటంతో పార్ల మెంట్‌లో ప్రత్యేకంగా బిల్లు పెట్టాల్సి ఉంటుంది. ఇటీవల మంద కృష్ణమాదిగ సారథ్యంలో ఎమ్మార్పీఎస్ నిర్వహించిన ధర్మయుద్ధ మహాసభకు హాజరైన పార్టీలన్నీ వర్గీకరణకు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని కోరుతూ ప్రభుత్వం తరఫున అఖిలపక్షం ఢిల్లీకి వెళ్లనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉస్మానియా ఉత్సవాలకు రండి..
ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుంటారు. ఏప్రిల్‌లో జరిగే ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు ప్రత్యేకంగా వారిని ఆహ్వానించనున్నారు. ఈ మేరకు సీఎం.. రాష్ట్రప్రతి, ప్రధాని, పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలిసింది.
ప్రభుత్వం దిగిరాక తప్పదు: మందకృష్ణ మాదిగ
అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ అన్నారు. ప్రభుత్వాలు ప్రజా ఒత్తిడికి దిగి రాక తప్పదని రుజువైందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ మా వేలితో మా కంటినే పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. రెండ్రోజులుగా ఓయూలో ఎమ్మార్పీఎస్ విద్యార్థులు దీక్షలు చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపడుతున్నాం.
ఇది ప్రజా ఉద్యమంగా మారుతుందనే ప్రభుత్వం దిగి వచ్చింది. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ముందుకు వచ్చింది. ఎమ్మార్పీఎస్ తరపున మేం కూడా ఢిల్లీ వెళ్లి పార్లమెంట్‌లో బిల్లు పెట్టేలా ఒత్తిడి తెస్తాం. చేనేత వస్త్రాలను ప్రోత్సహించినట్లే కుట్టిన తోలు చెప్పులను ప్రభుత్వం ప్రోత్సహించాలి. సబ్‌ప్లాన్ స్ఫూర్తికి అనుగుణంగా చట్టాలు తీసుకురావాలి. పక్కదారి పట్టిన సబ్‌ప్లాన్ నిధులను రికవరీ చేయాలి. అవన్నీ మాకే ఖర్చు పెడితే 30 శాతం పేదరికం పోతుంది’’ అని ఆయన అన్నారు.
కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే..
ఆహ్వానించకపోవడంపై వైఎస్సార్‌సీపీ తెలంగాణ మండిపాటు
ఎస్సీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీని కలిసేందుకు సీఎం కేసీఆర్ తమ పార్టీని ఆహ్వానించకపోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ మండిపడింది. ఇది హైకోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని పేర్కొంది. కోర్టుల ఆదేశాలను కూడా అమలు చేయకుండా ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు.రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ సమయంలో నిర్వహించిన అఖిలపక్షానికి ఆహ్వానించక పోవడంపై తమ పార్టీ హైకోర్టును ఆశ్రయించిందన్నారు. రాష్ట్రంలో నిర్వహించే అన్ని అఖిలపక్ష భేటీలకు వైఎస్సార్‌సీపీని కూడా పిలవాలని కోర్టు ఆదేశాలిచ్చిందన్నారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.