కోదండరాం ఇంటి ముట్టడి | Kodandaram home invasion | Sakshi
Sakshi News home page

కోదండరాం ఇంటి ముట్టడి

Published Sun, Jul 20 2014 12:32 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

కోదండరాం ఇంటి ముట్టడి - Sakshi

కోదండరాం ఇంటి ముట్టడి

  •      ఆ ప్రకటనతో తనకు సంబంధం లేదని కోదండరాం స్పష్టీకరణ
  •      విద్యార్థులకు అండగా ఉంటానని హామీ
  • లాలాపేట: కాంట్రాక్టు ఉద్యోగుల పర్మనెంట్ ప్రకటనను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు శనివారం తార్నాకలోని జేఏసీ చైర్మన్ కోదండరాం ఇంటిని ముట్టడించారు.  తమ ఉద్యమానికి మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. తొలుత ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఓయూ క్యాంపస్ నుంచి ర్యాలీగా కోదండరాం ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థులు బయలుదేరారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను బారికేడ్లు, బందోబస్తుతో అడ్డుకునేందుకు యత్నించారు.

    ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థి నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది.  భారీ సంఖ్యలో హాజరైన విద్యార్థులు చివరకు కోదండరామ్ ఇంటికి చేరుకున్నారు. పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. విద్యార్థులకు అండగా ఓయూలోని అన్ని విద్యార్థి సంఘాల నాయకులు వచ్చారు. తెలంగాణ ఏర్పడితే కొత్త ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తే, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనలు చేస్తున్నాడని విద్యార్థులు మండిపడ్డారు.

    ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళనతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కోదండరాం వారితో మాట్లాడారు. కేసీఆర్ ప్రకటనతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. జేఏసీగా విద్యార్థులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జేఏసీలో ఈ విషయపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో విద్యార్థులు శాంతించి ఆందోళన విరమించారు.
     
    కొనసాగిన ఆందోళన
     
    కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ ప్రకటనను నిరసిస్తూ ఓయూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన శనివారం మూడో రోజుకు చేరుకుంది. విద్యార్థుల ర్యాలీని అడ్డుకోవడంతో ఓయూ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ప్రకటన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement