మెట్రో డైలమా | L&T shock to Telangana Government?, KCR demands for Underground Metro Rail in Hyderabad | Sakshi
Sakshi News home page

మెట్రో డైలమా

Published Tue, Jul 1 2014 9:12 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

మెట్రో డైలమా - Sakshi

మెట్రో డైలమా

*చారిత్రక కట్టడాలను కూల్చొద్దంటున్న సీఎం    
*టన్నెల్ విధానమే మేలని సూచన
* సాధ్యం కాదంటున్న నిర్మాణ సంస్థ
* మధ్యేమార్గంగా ఎల్‌అండ్‌టీ సర్వే

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెట్రో రైల్ పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. చారిత్రక కట్టడాలున్న రెండు మార్గాల్లో భూగర్భ మెట్రో పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ డైలమాలో పడింది. భూగర్భ మార్గం సాధ్యం కాదని సదరు సంస్థ పేర్కొంటున్నా సీఎం వినే పరిస్థితి లేకపోవడంతో సదరు రూట్లలో పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

ఇప్పటికే పలు పిల్లర్లు పూర్తయినా మిగతా పనులను నిలిపివేసింది. మొదట సర్వే చేపట్టి తద్వారా వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు సాగాలని ఆ సంస్థ భావిస్తోంది. ఇందుకుగాను ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఏదేమైనా భూగర్భ మెట్రో సాధ్యం కాదనే విషయాన్ని ఎల్‌అండ్‌టీ బాహాటంగానే స్పష్టం చేస్తున్నా స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది.
 
నిలిచిన పనులు!
 
చారిత్రక కట్టడాలున్న ప్రదేశాల్లో నిపుణుల బృందం అధ్యయనం చేయాల్సి ఉన్నందున మొజంజాహీ మార్కెట్, అసెంబ్లీ, లక్డీకాపూల్ మార్గంలో ప్రస్తుతానికి పనులు నిలిచిపోయినట్టు తెలిసింది. ఈ రూట్లో సోమవారం తాత్కాలికంగా కొన్ని బారికేడ్లను తొలగించారు. ఈ మార్గంలో సర్వే పూర్తయి, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాకే పనులు మొదలయ్యే అవకాశాలున్నాయని హెచ్‌ఎంఆర్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ మార్గంలో 20 వరకు ఎలివేటెడ్ పిల్లర్లు ఏర్పాటయ్యాయి.

భూగర్భ మెట్రో అంశంపై సాధ్యాసాధ్యాలను తేల్చేందుకు హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ సంస్థలు తాజాగా సంయుక్తంగా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా జేబీఎస్-ఫలక్‌నుమా రూట్లో సుల్తాన్‌బజార్ ప్రాంతంతోపాటు, ఎల్బీనగర్-మియాపూర్ రూట్లో ఎంజే మార్కెట్, అసెంబ్లీ, గన్‌పార్క్ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ భూగర్భ మెట్రో మార్గం వేయాల్సిందేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అసెంబ్లీలో విస్పష్ట ప్రకటన చేయడంతో మెట్రో వర్గాలు ఈ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. నిపుణుల కమిటీలో హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ ఉన్నతాధికారులతోపాటు స్ట్రక్చరల్ ఇంజనీర్లు, భూభౌతిక శాస్త్రవేత్తలు, రైల్వే రంగ నిపుణులు ఉన్నారని తెలిసింది. ఈ బృందం భూగర్భ మెట్రో సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం.  
 
భూగర్భ మార్గంపై అనుమానాలెన్నో..
 
కోల్‌కతాలోని భూగర్భ మెట్రో మార్గంలో ఇటీవల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సుమారు రెండు గంటల పాటు ఓ మెట్రోరైలు నిలిచిపోయింది. ప్రయాణికులు బయటికి వెళ్లే దారిలేక, శ్వాస ఆడక స్పహతప్పిపోయిన ఉదంతాన్ని సైతం నిపుణుల బృందం పరిగణనలోకి తీసుకుని నివేదికలో ప్రస్తావించనున్నట్టు తెలిసింది. నగరంలో భూగర్భ మార్గంలో పనులు చేపట్టాల్సి వస్తే ప్రతి మూడు మీటర్ల లోతున వచ్చే రాతి నేల (రాక్ సాయిల్)ను తొలిచేందుకు బ్లాస్టింగ్ (పేలుడు పదార్థాల వినియోగం) చేయడం వీలుకాదనే అంశాన్ని నివేదికలో పొందుపరిచే అవకాశం ఉన్నట్టు సమాచారం. బ్లాస్టింగ్‌ల వల్ల చారిత్రక కట్టడాలకు మరో రూపంలో ప్రమాదం పొంచి ఉంటుందని, రద్దీ రూట్లో ఇది సాధ్యపడదని అంటున్నారు. కాగా భూగర్భ మార్గంలో పనులు చేపడితే భద్రతాపరంగా వచ్చే సమస్యలను సైతం ప్రస్తావించనున్నట్లు సమాచారం.
 
ఎల్‌అండ్‌టీ లేఖపై కలకలం?

 
భూగర్భ మెట్రో సాధ్యం కాదని మెట్రో ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ వర్గాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసినట్టు వచ్చిన కథనాలను ఇటు ఎల్‌అండ్‌టీ, అటు హెచ్‌ఎంఆర్ వర్గాలు ఖండించలేదు. దీనిపై ఆయా సంస్థల ఉన్నతాధికారులు మాట్లాడేందుకు నిరాకరించారు. ముందుగా అనుకున్న ప్రకారం నాగోల్-మెట్టుగూడ రూట్లో మెట్రో మొదటి దశను 21 మార్చి 2015 నాటికి ప్రారంభిస్తామని హెచ్‌ఎంఆర్ వర్గాలు తెలిపాయి. జూలై మొదటి లేదా రెండో వారంలో ఇదే రూట్లో ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నాయి.
 
ఆదేశాలు అందలేదు: ఎల్‌అండ్‌టీ
 
భూగర్భ మెట్రోపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్ సంస్థలకు ఎలాంటి ఆదేశాలు, సూచనలు అందలేదని ఎల్‌అండ్‌టీ వర్గాలు సోమవారం స్పష్టం చేశాయి. ముందుగా కుదిరిన ఒప్పందం మేరకు, అందులో ప్రస్తావించిన పనులు విధిగా పూర్తిచేస్తామని తెలిపాయి. ఒప్పందానికి విరుద్ధంగా ఎలాంటి పనులు చేపట్టలేమని స్పష్టం చేశాయి. దీనిపై తాము ప్రభుత్వానికి ఎలాంటి లేఖ రాయలేదని పేర్కొన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement