నేతల ఫొటోలు తొలగించండి: భన్వర్‌లాల్
అధికారులకు సీఈఓ భన్వర్‌లాల్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ప్రభుత్వ ఆస్తులపై ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ర్ట మంత్రులు, రాజకీయపార్టీల నాయకుల ఫొటోలను తక్షణం తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లు, అన్ని శాఖల ఉన్నతాధికారులు, డీజీపీ, ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ అధికారులకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
ఆర్టీసీతోసహా అన్ని ప్రభుత్వ వాహనాలపైనా ఈ ఫొటోలను తొలగించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ భవనాలతోపాటు వెబ్‌సైట్ల నుంచి పైన పేర్కొన్నవారి ఫొటోలను తొలగించాలని భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. అలాగే జంటనగరాలతోపాటు రాష్ట్రమంతటా పలుచోట్ల ఏర్పాటు చేసిన ప్రభుత్వ పెద్దల ఫొటోలతో కూడిన హోర్డింగ్స్‌ను కూడా తీసేయాలని ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిధి నుంచి ఎన్నికల కోడ్ ముగిసేవరకు ఏ పథకానికీ నిధులను విడుదల చేయరాదన్నారు.