చిరుత జాడ కోసం నార్మ్ ప్రధాన రహదారిపై వెళ్తున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో సీసీ కెమెరాలకు చిక్కిన చిరుతను పట్టుకునేందుకు అటవీ, పోలీసు శాఖల అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గ్రేహౌండ్స్, ఫైరింగ్‌రేంజ్, నార్మ్, గగన్‌పహాడ్ అటవీ ప్రాంతాన్ని శుక్రవారం ఇరు శాఖల అధికారులు సంయుక్తంగా జల్లెడ పట్టారు. అటవీ శాఖ రంగారెడ్డి జిల్లా రేంజ్ అధికారి విక్రమ్‌చంద్ర, రాజేంద్రనగర్ ఎస్సై సురేశ్ తమ సిబ్బందితో సీసీ కెమెరాలలో కనిపించిన ప్రాంతంతో పాటు బయోడైవర్సిటీ పార్క్, చెరువు, గ్రేహౌండ్స్ రేంజ్ పరిసరాలను పరిశీలించారు.
చెరువుతో పాటు బయోడైవర్సిటీ పార్కు, గ్రేహౌండ్స్ ఖాళీ ప్రదేశాల్లో చిరుత అడుగు జాడలు కనిపించాయి. బుద్వేల్ రైల్వే అండర్ పాస్ వద్ద కనిపించిన చిరుత గురువారం రాత్రి నార్మ్‌లో కనిపించిన చిరుత ఒకటే అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వర్సిటీ ఖాళీ ప్రదేశంలో కనిపించిన అడుగుల ముద్రలు, శుక్రవారం కనిపించిన అడుగుల ముద్రలు పోలి ఉన్నాయని తెలిపారు. చెరువు ప్రాంతంలో చిరుత అడుగు జాడలు స్పష్టంగా కనిపించగా..చిరుత జాడ కోసం మధ్యాహ్నం వరకు వెతికిన అధికారులు అనంతరం తిరిగి వెళ్లిపోయినట్లు చెప్పారు. చుట్టు పక్కల ప్రాంతాల్లోని ప్రజలందరినీ అప్రమత్తం చేశామని అధికారులు తెలిపారు.
స్థానికుల భయాందోళన
నార్మ్ ప్రాంతంలో చిరుత జాడ కనిపించడంతో రాజేంద్రనగర్ వాసులు ఉలిక్కిపడ్డారు. బుద్వేల్ రైల్వే అండర్ పాస్ వద్ద కనిపించి జాడ తెలియకుండా పోయి గురువారం రాత్రి చిరుత సీసీ కెమెరాలకు చిక్కింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. నార్మ్ ప్రధాన రహదారి పక్క నుంచే మాణిక్యమ్మ కాలనీ, అంబేడ్కర్ బస్తీ, రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాలు ఉన్నాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతను బంధించేందుకు బోన్‌లు ఏర్పాటు చేయా లని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.
వామ్మో.. చిరుత!
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి అడవి పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరించడం కలకలం రేపుతోంది. శుక్రవారం మధ్యాహ్నం మల్కపేట రిజర్వాయర్ కాలువ మరమ్మతు పనులు జరుగుతుండగా.. సమీప ప్రాంతం నుంచి చిరుత వెళ్లడాన్ని ఓ టిప్పర్ డ్రైవర్ తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు చేరవేశాడు. చిరుత నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించి జూ పార్కుకు తరలించాలని అక్కపల్లి సర్పంచ్ మధుకర్ కోరారు.
మల్కపేట రిజర్వాయర్ కాలువ వెంట వెళ్తున్న చిరుత
మళ్లీ పెద్దపులి కలకలం
మంచిర్యాల జిల్లా తాండూర్‌తో పాటు గిరిజన గూడేల్లో మళ్లీ పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మారుమూల అటవీ ప్రాంతం శివారు గూడేల వైపు పెద్దపులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు తాజాగా గుర్తించారు. నర్సాపూర్, అబ్బాపూర్, బెజ్జాల గిరిగూడేల మీదుగా మాదారం త్రీఇంక్లైన్ శివారు అటవీ ప్రాంతం వరకు పులి అడుగులను శుక్రవారం బెల్లంపల్లి అటవీ రేంజ్ అధికారి మజారొద్దీన్, డిప్యూటీ రేంజ్ అధికారి తిరుపతి, బీట్ అధికారి తన్వీర్‌ఖాన్ సేకరించారు. పులి పాదముద్రలను కొలతలు తీసుకున్నారు. పులి కదలికలపై నిఘా వేసి ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పులి తిష్ట వేసిన లొకేషన్‌ను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
పెద్దపులి పాదముద్ర కొలత తీసుకుంటున్న దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment