గోవర్ధనగిరిలో అటవీ అధికారుల పరిశీలన
రఘునాథపల్లి : మండలంలోని గోవర ్ధనగిరి పరిసర ప్రాంతాల్లో పశువుల పాకలలో ఉన్న లేగ దూడలను చంపింది చిరుత పులి కాదని, హైనా అనే జంతువని వరంగల్ అటవీ శాఖ రేంజ్ అధికారి ప్రకాష్ తెలిపారు. గ్రామానికి చెందిన ఈదులకంటి మల్లారెడ్డి, గొడుగు రాజు, ఈదులకంటి ప్రతాప్‌రెడ్డి, వల్లపు రాజు, చిలువేరు బచ్చయ్యలకు చెందిన లేగ దూడలను గుర్తు తెలియని జంతువు హతం చేసిన విషయం విదితమే.
ఈ మేరకు బుధవారం రాత్రి ప్రకాష్‌తో పాటు భీట్ ఆఫీసర్లు శివాజి, హుస్సేన్, సెక్షన్ అధికారి అరుణ గ్రామ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. బాదిత రైతుల నుంచి లేగ దూడలను జంతువు చంపిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. జంతువు చేతిలో మృతి చెందిన లేగ దూడలను భూమిలో నుంచి వెలికి తీసి గురువారం శవ పంచనామ చేస్తామని చెప్పారు. దూడలను చంపింది చిరుతనా, హైనానా అనేది పంచనామాలో స్పష్టంగా తేలుతుందన్నారు.