మట్టుపెట్టిన చిరుతతో షఫత్ అలీఖాన్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని థూలే జిల్లాలో బీభత్సం సృష్టించిన మ్యానీటర్‌ను హైదరాబాదీ హంటర్ నవాబ్ షఫత్ అలీఖాన్ మట్టుబెట్టారు. రెండు నెలల పాటు జనావాసాలపై దాడులు చేసిన ఈ ఆడ చిరుత ఏడుగురిని చంపడంతో పాటు మరో ఎనిమిది మందిని తీవ్రంగా గాయపరిచింది. ఆ రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆహ్వానం మేరకు షఫత్ అలీ ఖాన్ అతికష్టమ్మీద శనివారం రాత్రి దాని ఆచూకీ కనిపెట్టగలిగారు. ఆకలి, ఆగ్రహంతో ఉన్న ఆ చిరుత దాడికి ప్రయత్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్చి చంపినట్లు అలీ ఖాన్ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు.
ఆహారం కోసం బయటకు వచ్చి...
మహారాష్ట్రలోని థూలే జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతంలో అనేక చిరుత పులులు ఉంటున్నాయి. చాలీవ్ గావ్ పరిసరాల్లో నివసించే ఓ ఆడ చిరుతకు అడవిలో ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఆహారాన్ని వెతుక్కుంటూ మూడు నెలల క్రితం చాలీవ్ గావ్ పరిసరాల్లోకి వచ్చింది. తొలినాళ్లల్లో అక్కడి పొలాల్లో ఉండే అడవి పందుల్ని చంపి తినేది. ఆపై గ్రామంలోకి ప్రవేశించి కుక్కలు, మేకలు, పశువులు.. ఆపై మనుషులపైనా దాడులు చేయడం మొదలెట్టింది.
ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో...
మహారాష్ట్ర ప్రభుత్వం తొలుత ఈ చిరుతను మత్తు మందు ఇవ్వడం (ట్రాంక్వలైజింగ్) ద్వారా పట్టుకోవాలని భావించింది. 15 గ్రామాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈ ఆడ చిరుతను పట్టుకోవడానికి ఏడు ట్రాంక్వలైజింగ్ బృందాలు 20 రోజుల పాటు తీవ్రంగా శ్రమించాయి. అయినా ఫలితం లేక ఆ రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ హైదరాబాద్‌కు చెందిన షఫత్ అలీఖాన్‌ను ఆహ్వా నించారు. దేశవ్యాప్తంగా 23 మ్యానీటర్ల, మదపు టేనుగుల్ని చంపిన అనుభవం ఉన్న అలీఖాన్ ఈ మ్యానీటర్ కోసం ఈ నెల 4న రంగంలోకి దిగారు.
మత్తు మందిచ్చే ఆస్కారం లేక...
రాత్రి వేళల్లో గ్రామాలపై దాడి చేసి, పగటిపూట సమీపంలోని అటవీ ప్రాంతంలో దాక్కునే ఈ మ్యానీటర్‌పై సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేసిన అలీఖాన్ శనివారం ఉదయం వర్కేడ్ గ్రామ పరిసరాల్లో చిరుత కదలికల్ని గుర్తించారు. దాదాపు 12 గంటల వెదుకులాట తర్వాత రాత్రి 10.15కి మ్యానీటర్‌ను తుపాకీతో కాల్చి చంపారు. ఆదివారం ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడిన అలీఖాన్ ‘ఆ మ్యానీటర్‌ను ట్రాంక్వలైజ్ చేయాలనే ఉద్దేశంతోనే సెర్చ్ ఆపరేషన్ చేశాం. అయితే రాత్రి వేళ హఠాత్తుగా తారసపడిన చిరుత దాడికి యత్నించింది. ఈ నేపథ్యంలో కాల్చిన తొలి తూటాకే నేలకొరిగింది’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment