జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం ప్రారంభించారు.
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్) : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం ప్రారంభించారు. ఉప్పుగూడ డివిజన్‌లో ఆయన ఎంఐఎం అభ్యర్థి ఫహద్ అబ్దుల్ సమద్ బిన్ అబ్దాద్‌తో కలసి విస్తృతంగా పాదయాత్ర చేశారు. మజ్లిస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా పెద్దల దీవెనలు అందుకుంటూ ముందుకు సాగారు. నర్కీపూల్‌బాగ్, అహ్మద్ కాలనీ, బిస్మిల్లా హోటల్, చాంద్రాయణగుట్ట రోడ్డు తదితర ప్రాంతాలలో ఈ పాదయాత్ర కొనసాగింది.
అనంతరం ఆయన మాట్లాడుతూ...పాతబస్తీ అభివృద్ధి మజ్లిస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. ఇంకేమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. కాగా బార్కాస్ డివిజన్ నూరీనగర్, అహ్మద్ నగర్‌లలో మజ్లీస్ శాసనసభ పక్షనేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రచారం నిర్వహించారు. బార్కాస్ ఎంఐఎం అభ్యర్థి షబానా బేగంతో కలిసి ఆయన బస్తీలో పర్యటించి మజ్లిస్‌కు ఓటు వేయాలని ఓటర్లను కోరారు.