రూ.5కే బువ్వ
రైతులకు ‘సద్దిమూట’.. రోగులకు ‘భోజనామృతం’
* నేడు సిద్దిపేటలో ప్రారంభం
* ప్రభుత్వ ఆస్పత్రి,, మార్కెట్ యార్డుల వద్ద సెంటర్లు
సిద్దిపేట అర్బన్: వివిధ పనుల నిమిత్తం సిద్దిపేటకు వచ్చే రైతులకు...సర్కార్ దవాఖానాలోని రోగులు, వారి సహాయకులకు రూ.5కేపౌష్టికాహారం అందించేందుకు సర్కార్ సిద్ధమైంది. హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ ట్రస్ట్, మెఘా ఇంజనీరింగ్ ఇండస్ట్రీయల్ లిమిటెడ్ (మీల్)ల సహకారంతో ఈ పథకాన్ని నేటి నుంచి ప్రారంభించనుంది.
సిద్దిపేట ఏరియా ఆస్పత్రి, మాతాశిశు సం క్షేమ కేంద్రాలతో పాటు స్థానిక వ్యవసాయ మార్కెట్, పత్తిమార్కెట్‌లలో కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.5లకే మధ్యాహ్న భోజనం అందించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ), ఉస్మానియా ఆస్పత్రిలో విజయవంతంగా అమలు చేస్తున్న పౌష్టికాహార పథకాన్ని సోమవారం మంత్రి హరీష్‌రావు సిద్దిపేటలో ప్రారంభించనున్నారు.
తక్కువ ధరకే నాణ్యమైన భోజనం
భోజన కేంద్రాల్లో రూ. 5 తీసుకుని 450 గ్రాముల అన్నం, చెట్ని, కూర, సాంబర్‌తోపాటు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తారు. వాస్తవానికి ఈ మేర ఆహారం తయారు చేసేందుకు సుమారుగా రూ.20 వరకు ఖర్చు అవుతుంది. కానీ వ్యయంలో నాల్గవవంతు మాత్రమే రైతుల నుంచి తీసుకుంటారు. మిగిలిన మొత్తాన్ని రెండు స్వచ్ఛంద సంస్థలు భరిస్తాయి.
పటాన్‌చెరులోని హరే కృష్ణ ట్రస్ట్‌లోని ఆధునిక భారీ వంటగదిలో ఈ ఆహారాన్ని తయారు చేసి మధ్యాహ్నం వరకు సిద్దిపేటకు తరలిస్తారు. స్థానిక ఏరియా ఆస్పత్రి, మాతాశిశు సంక్షేమ కేంద్రాల వద్ద అమలు చేసే ఈ పథకానికి బాలామృతం అని పేరు పెట్టారు. ఇక రైతులకోసం మార్కెట్ యార్డుల్లో అమలు చేస్తున్న పథకానికి సద్దిమూటగా పేరు నిర్ణయించారు.
రోగులకు మంచి పౌష్టికాహారం
సిద్దిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి జిల్లా వాసుకే కాకుండా, కరీంనగర్, వ రంగల్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల నుంచి వందలాది మంది పేద రోగులు వస్తుంటారు. అ లాంటి వారికి భోజనామృతం తక్కువధరకే కడుపునింపుతుంది. ఆధునిక పద్ధతుల్లో తయారు చేసే ఈ ఆహారం వల్ల రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంది. పౌష్టికాహార లోపం వల్లనే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న క్రమంలో ఈ పథకం రావడం మంచి పరిణామం.
- డా. కాశీనాథ్,సిద్దిపేట హైరిస్క్ కేంద్రం ఇన్‌చార్జి
అన్నం కోసం ఎన్నో తిప్పలు పడుతున్నాం
దవాఖానాలో అన్నం కోసం ఎన్నో తిప్పలు పడుతున్నాం. పైసలు పెట్టినా మంచి భోజనం దొరుకుతలేదు. గీ కొత్త పథకంతో మంచి భోజనం పెడితే మాకెంతో మేలు. మాతోటి వచ్చే కుటుంబ సభ్యులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అందరికీ అందుబాటులోకి దీనిని తీసుకురావాలి.
- దుర్గవ్వ, రంగధాంపల్లి
‘సద్దిమూట’ రైతులకు వరం
సీజన్‌లో ధాన్యం అమ్మకం కోసం మార్కెట్ యార్డుల్లో రోజుల తరబడి ఉండాల్సి వస్తుంది. ఇంటికెళ్లి తెచ్చుకున్న సద్ది ఒక్కరోజే ఉంటుంది. తెల్లారితే ఏమి తినాలో, ఏం కొనాలో తెలవక రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి కోసం సద్దిమూట పథకం ద్వారా మంచి భోజనాన్ని అందించడం ఆనందించదగ్గ విషయం.
- మ్యాడ రాజిరెడ్డి, రైతు, బండారుపల్లి
పస్తులు తప్పుతాయి
కేవలం పంటలు అమ్ముకోవడానికే కాకుండా ఎరువులు, విత్తనాలు, పురుగుల మందు ల కోసం వందలాది మంది రైతులు సిద్దిపేటకు వస్తుం టారు. ఒక్కోసారి డబ్బు సరి పడినంతగా లేక పస్తులతోనే ఇళ్లకు వెళ్తుంటారు. అలాంటి రైతులకు సద్దిమూట పథకం కడుపు నింపుతుంది. ఇందుకు కృషి చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు.
- మొసర్ల మధుసూదన్‌రెడ్డి,రైతు సంఘం నాయకుడు