సాక్షి, తాడ్వాయి: ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన మేడారం మహా జాతరకు తేదీలు ఖరారయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నిర్వహించే జాతర ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. కోట్లాది మంది భక్తిభావంతో సమ్మక్క, సారలమ్మ తల్లులను కొలుస్తారు. వారి దీవనెల కోసం ఈ జాతరకు తరలివస్తారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర సమయంలో మేడారం అడవులన్నీ జనసంద్రంగా మారుతాయి.
కాగా సమ్మక్క, సారలమ్మ జాతర తేదీలను మేడారంలోని ఆలయ ప్రాంగణంలో పూజారులు మహా జాతర తేదీలను ప్రకటించారు. వచ్చే ఏడాది (2018) జనవరి 31(బుధవారం) తొలిరోజున కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ ఆలయంలో ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం వేళ కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారం గద్దెల వద్దకు తీసుకు వస్తారు. ఫిబ్రవరి 1(గురువారం) రెండో రోజు సమ్మక్క దేవతను చిలుకలగుట్ట నుంచి గద్దెలపైకి తీసుకువస్తారు. ఫిబ్రవరి 2న (శుక్రవారం) భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. 3న(శనివారం) అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేయడం జరుగుతుందని పూజారులు వివరించారు.
గ్రహణం తర్వాతనే గద్దెలపైకి
మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర ప్రారంభం రోజున( జనవరి 31) గద్దెలపైకి సారలమ్మ చేరుకునే సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది. దీంతో గ్రహణం వీడిన తర్వాత సారలమ్మను గద్దెలపైకి తీసుకు రానున్నారు. ఈ మేరకు సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం నిర్ణయించింది. 31వ తేదీ సాయంత్రం 6:04 నుంచి రాత్రి 8:40 వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీంతో గ్రహణ సమయంలో ఏం చేయాలనే అంశంపై సందిగ్ధత ఏర్పడటంతో గ్రహణం వీడిన తర్వాత రాత్రి 9 గంటల సమయంలో సారలమ్మను మేడారం గద్దెలపైకి తీసుకురావాలని పూజారుల సంఘం నిర్ణయించింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని గ్రహణం విడిచిన తర్వాత సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తీసుకొస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment