సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ చిరస్మరణీయుడని తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య అన్నారు. గురువారం రవీంద్రభారతిలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ లలితకళా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సినీరంగంలో ఎన్టీఆర్‌ను మించినవారు లేరన్నారు. కొన్ని పాత్రలకైతే ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు. తెనాలిలో తన స్నేహితుడి సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి ఆనాడు ఎన్టీఆర్‌ను ఆహ్వానిస్తే వచ్చారని గుర్తుచేసుకున్నారు. తర్వాతి కాలంలో రాజకీయంగా విభేదించుకోవటం లాంటి విషయాలు జరిగి పోయాయని తెలిపారు.
తెలుగు మహాసభల్లో ప్రస్తావనేదీ?
తెలంగాణ గడ్డపై ఎంతోమంది దళితులను చేరదీసి, వారికి రాజకీయ భవిష్యత్తు కల్పించిన మహామనిషి ఎన్టీఆర్ అని సమాచార హక్కు పూర్వ కమిషనర్ విజయబాబు అన్నారు. కానీ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నవారు ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకపోవడం విషాదకరమన్నారు. అనంత రం ఎన్టీఆర్ లలితకళా పురస్కారాలను సినీనటుడు టి.చలపతిరావు, ప్రముఖ రచయిత్రి డాక్టర్ వాసా ప్రభావతి, ప్రవాసాంధ్రుడు సిడ్నీ బుజ్జికి రోశయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించి, మెమెంటో, నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్టీఆర్ చలనచిత్ర సంగీత విభావరి అలరించింది. కార్యక్రమంలో ప్రముఖ సినీనటి అన్నపూర్ణ, కార్యక్రమ నిర్వాహకుడు వైకే నాగేశ్వరరావు, సినీ దర్శకుడు గీతాకృష్ణ, సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం తదితరులు పాల్గొన్నారు.
పోరాట స్ఫూర్తి ఎన్టీఆర్
ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్‌పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ‘నా జీవితం ఎన్టీఆర్ మలచిన శిల్పం. ఎన్టీఆర్‌తో గడిపిన ప్రతిక్షణం మరచిపోలేను. జనవరి 17 నా జీవితంలో ఎప్పుడూ గుర్తుండిపోతుంది. కన్నీళ్లు వస్తే బయటకు ఏడ్వవద్దు అనేవారు. మన కన్నీళ్లు మనమే తుడుచుకొని పోరాటం చేయాలని నాలో స్ఫూర్తిని నింపేవారు. ఎన్టీఆర్ భార్య అన్న గొప్ప పదవి ఇచ్చి వెళ్లారు. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేను. ఆయనకు జరిగిన అన్యాయంపై ఎన్నో విధాలుగా పోరాటం చేశాను. జీవితంలో తుదిశ్వాస వరకు ఆయన ఆశయ సాధన కోసం పోరాటం చేస్తూనే ఉంటాను. ఆయన లేరని నేననుకోవడం లేదు. రాజకీయం నా భర్త ఎన్టీఆర్‌కు శాపం అయింది’ అని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment