మాట్లాడుతున్న టీఆర్‌ఎస్ నాయకులు
మిర్యాలగూడ : కమీషన్లు, కాంట్రాక్టుల కోసమే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఆవుల పీతాంబర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో నిధులు కేటాయించడం లేదని మాట్లాడిన ఎమ్మెల్యే పార్టీ పరువు తీశారని పేర్కొన్నారు. అవినీతి గురించి ఎమ్మెల్యే, ఎంపీపీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చింతపల్లి గ్రామ శివారులో డాంబర్ మిక్సింగ్ ప్లాంట్ ఎవరితో నియోజకవర్గంలో అందరికి తెలుసని, అదే విధంగా బీటీ రోడ్ల నిర్మాణం ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఎవరికి అప్పగిస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. మినీ ట్యాంక్ బండ్ పనులలో కమీషన్ల కోసం బెదిరిస్తే కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడని ఆరోపించారు. అదే విధంగా సాగర్ రోడ్డు విస్తరణలో అధికంగా నిధులు మంజూరు చేయించి ఎవరి లబ్ధి చేకూర్చారో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. 2014 ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాలకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నానని బకల్‌వాడ పాఠశాలలో బహిరంగసభలో ఎమ్మెల్యే చెప్పాడనేది నిజం కాదా అని అన్నారు. గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించేది ఎవరనేది ప్రతి ఒక్కరికి తెలుసని ఈ విషయాలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు తలకొప్పుల సైదులు, దండ ప్రభాకర్‌రెడ్డి, గజ్జెల నర్సిరెడ్డి, కస్తూరి బాస్కర్, జంగిలి లింగయ్య, కురియ శ్రీనివాస్, సహదేవుని శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment