మోదీ పాలన ఆదర్శప్రాయం
► గతంలో కేంద్రంలో కుటుంబపాలన సాగింది
► బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ
దిలావర్‌పూర్ : గతంలో దేశంలో పాలించిన సర్కారు కారణంగా అభివృద్ధి కుంటుపడిందని, కానీ ప్రస్తుతం నరేంద్రమోదీ పాలన ఆదర్శప్రాయంగా సాగుతోందని బీజేపీ నేత, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ అన్నారు. ‘గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి’ అనే నినాదంతో చేపట్టిన దేశవ్యాప్త ప్రచారోద్యమంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని నర్సాపూర్(జి) గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి నుంచి పంచాయతీరాజ్ వికాస్ దివస్ వరకు ఈ ప్రచారోద్యమ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో అనేక కార్యక్రమాలను చేపడుతోంద ంటూ పలు పథకాల గురించి వివరించారు.
అంబేద్కర్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వడంలో, పార్లమెంట్‌లో చిత్రపటాన్ని ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదేనని గుర్తు చేశారు. రాష్ర్ట ప్రభుత్వం తామే చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న పలు కార్యక్రమాల్లో కేంద్రప్రభుత్వ వాటానే అధికంగా ఉందని పేర్కొన్నారు.
స్వచ్ఛభారత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావుల రాంనాథ్ మాట్లాడుతూ, నేడు రాష్ట్రంలో పాలన గాడితప్పుతోందని విమర్శించారు. ఆదిలాబాద్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌చేశారు. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు అయ్యన్నగారి భూమయ్య, నాయకులు సుధాకర్, ఒడిసెల శ్రీనివాస్, మెడిసెమ్మ రాజు, మండల అధ్యక్షుడు బర్కుంట నరేందర్, సామరాజేశ్వర్‌రెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు.