కాళేశ్వరంలో ‘మోటార్‌’ రేస్‌ | Motors clamping process is ongoing in Kaleshwaram | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంలో ‘మోటార్‌’ రేస్‌

Published Thu, May 16 2019 2:26 AM | Last Updated on Thu, May 16 2019 2:26 AM

Motors clamping process is ongoing in Kaleshwaram - Sakshi

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని మళ్లించే ప్రక్రియకు గడువు ముంచుకొస్తోంది. గోదావరిలో వరద మొదలయ్యేందుకు మరో నెల రోజులకు మించి సమయం లేకపోవడంతో ఆలోగా పనులన్నీ పూర్తి కావాల్సి ఉంది. మే నెలాఖరుకే అన్ని పంప్‌హౌస్‌లలో మోటార్ల బిగింపు ప్రక్రియ పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నా వేసవి తాపం, మధ్యలో కురిసిన వర్షాలు కొంత అవాంతరం సృష్టించాయి. దీంతో జూన్‌లో అన్ని మోటార్ల బిగింపు ప్రక్రియ పూర్తి చేసి జూలైలో వరద పుంజుకునే నాటికి గోదావరి నీటిని ఎత్తిపోసేలా ప్రస్తుతం అధికారులు పనులు ముమ్మరం చేశారు.
- సాక్షి, హైదరాబాద్‌

జూన్‌లో వెట్‌రన్‌.. జూలై నుంచి ఎత్తిపోతలు
ప్రస్తుతం మేడిగడ్డ మినహా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులన్నీ పూర్తయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీలో 85 గేట్లకుగాను 35 గేట్లను ఇప్పటికే అమర్చగా మిగతా గేట్లు అమర్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మేడిగడ్డ పరిధిలో గోదావరిలో కలిసే చిన్నచిన్న వాగులు, వంకలన్నీ బ్యారేజీ వెనుక భాగంలో కలుస్తున్నాయి. దీంతో వరద అధికంగా ఉంటే బ్యారేజీ వెనుక భాగంలో ముంపు ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాగులు, వంకల నీటిని డైవర్షన్‌ చానల్‌ నిర్మించి బ్యారేజీ ముందుకు మళ్లించేలా చూడాలని సీఎం సూచించారు. ఈ పనులు పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక మేడిగడ్డ పంప్‌హౌస్‌లో 11 మోటార్లకుగాను 6 మోటార్లు అమర్చే ప్రక్రియ పూర్తికాగా అన్నారంలో 8కిగాను 5, çసుందిళ్లలో 8కిగాను 6 మోటార్ల అమరిక పూర్తయింది. మిగతా మోటార్లలో వీలైనన్ని ఈ నెలాఖరుకు, మిగతావి జూన్‌ తొలి లేదా రెండో వారానికి పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకున్నారు.

ఈ ప్రక్రియ పూర్తయితేనే ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం సాధ్యమవుతుంది. లేనిపక్షంలో కనిష్టంగా రోజుకు ఒక టీఎంసీని వరద ఉండే అన్ని రోజుల్లో ఎత్తిపోయాలని నిర్ణయించారు. ఇప్పటికే సిద్ధమైన మోటార్లకు జూన్‌లో వెట్‌రన్‌ నిర్వహించనుండగా జూలై నుంచి గోదావరి వరద నీటిని ఎత్తిపోయనున్నారు. ఇక ప్యాకేజీ–6లో 7 మోటార్లకుగాను 4 సిద్ధమవగా ఇందులో రెండింటికి ఇప్పటికే వెట్‌రన్‌ నిర్వహించగా మరో రెండింటికి బుధవారం వెట్‌రన్‌ నిర్వహించారు. ఈ ప్రక్రియ విజయవంతం అయింది. మిగతా మోటార్లను వచ్చే నెల మొదటి వారానికి సిద్ధం చేయాలని లక్ష్యం నిర్దేశించారు. ఇక ప్యాకేజీ–8లోనూ7 మోటార్లకుగాను 6 ఇప్పటికే సిద్ధమవగా వాటికి జూన్‌లో వెట్‌రన్‌ నిర్వహించే అవకాశం ఉంది. 

పంప్‌హౌస్‌ల పనులన్నీ పాత ఏజెన్సీకే...
గోదావరి నుంచి అదనంగా మరో టీఎంసీ నీటిని సైతం ఎత్తిపోయాలని భావిస్తున్న ప్రభుత్వం... అందుకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌లలో అదనపు పంపులు, మోటార్లు బిగించే ప్రక్రియను పాత ఏజెన్సీకే అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పంప్‌హౌస్‌లకు సంబంధించి రూ. 7,962 కోట్ల మేర పనులను మేఘా ఏజెన్సీకి అప్పగించారు. తదనంతరం ఈ పనుల్లో అదనపు మోటార్ల ఏర్పాటుకు సంబంధించిన పనులను జత చేసి వ్యయ అంచనాను రూ. 12,324 కోట్లకు సవరించారు. ప్రస్తుతం ఎస్‌ఏఎస్‌ఆర్‌ ప్రకారం ఈ రేట్లను రూ. 12,392 కోట్లకు సవరించారు. అదనంగా మూడు పంప్‌హౌస్‌ల పరిధిలో 15 మోటార్లను ఏర్పాటు చేయనుండగా ఈ పనులకు కొత్తగా టెండర్లు పిలిస్తే మూడు నెలలు పట్టే అవకాశం ఉండటం, మళ్లీ మోటార్లను విదేశాలను తెప్పించేందుకు మరింత జాప్యం కానుండటం వంటి కారణాల నేపథ్యంలో ఈ పనులను పాత ఏజెన్సీకే కట్టబెట్టాలని మంగళవారం జరిగిన నీటిపారుదలశాఖ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement