పోరాడితేనే తెలంగాణకు ఎయిమ్స్
కేంద్రం ఎయిమ్స్ ప్రకటనపై ఎంపీ జితేందర్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ‘పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. పోరాటం చేస్తే తప్ప రాష్ట్రానికి ఏమీ దక్కడంలేదు. ఇప్పుడు అలాగే పోరాటం చేసి తెలంగాణకు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను సాధించుకున్నాం’అని లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్ష నేత జితేందర్‌రెడ్డి అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన ఎయిమ్స్ ఏర్పాటు హామీని అమలు చేయాలని గత రెండున్నరేళ్లుగా టీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న పోరాటం నేటికి ఫలించిందని ఆయన అన్నారు. తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన చేసిన తరువాత జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రెండున్నరేళ్లుగా ఎయిమ్స్ కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మార్గదర్శకత్వంలో పార్టీ ఎంపీలు చేసిన కృషి నేటికి ఫలించిందని జితేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో ఎయిమ్స్ కేటాయింపు లేకపోవడం వల్ల తీవ్ర నిరాశ చెందామని ఆయన అన్నారు. దీనికి నిరసనగా తమ పార్టీ ఎంపీలు లోక్‌సభకు హాజరుకాకూడదని నిర్ణయించారన్నారు. బడ్జెట్ ఓటింగ్‌కు వచ్చే ముందైనా ఇచ్చిన హామీకి అనుగుణంగా ఎయిమ్స్ ప్రకటన చేయాలని బుధవారం అరుణ్ జైట్లీని, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను ప్రత్యేకంగా కలసి విజ్ఞప్తి చేశామన్నారు. గత కొన్ని రోజులుగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడికి తలొగ్గి తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుపై లోక్‌సభలో ప్రకటన చేశారని ఎంపీ వినోద్ తెలిపారు.