లక్ష్మణ్, కవిత దంపతులు
రామడుగు (చొప్పదండి): చిన్న మనస్పర్థలతో భార్యాభర్తలు ఐదేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. విడిపోవడానికి కోర్టు మెట్లెక్కారు. కానీ.. స్థానిక ఎన్నికల పుణ్యమా అని విడిపోవడానికి నిశ్చయించుకున్న దంపతులు ఏకమయ్యారు. వివరాలు.. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలోని మోతె ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. దీంతో పలువురు ఆభ్యర్థులు టీఆర్‌ఎస్ పార్టీ నుంచి టికెట్టు ఆశించారు. కోరటపల్లికి చెందిన సీనియర్ నేత కలిగేటి లక్ష్మణ్ కూడా టికెట్టు కోసం పార్టీ అధినాయకత్వానికి విన్నవించుకున్నాడు. పలువురి పేర్లతోపాటు లక్ష్మణ్ పేరు కూడా పరిశీలించారు. కుటుంబ గొడవల కారణంగా ఆయన భార్య కాపురానికి రావడం లేదన్న విషయం నాయకులు గుర్తించారు.
ఇదే విషయమై లక్ష్మణ్‌ను అడగగా, తన భార్య రావడం లేదని, కోర్టులో కేసు నడుస్తుందని, తన తల్లికి టికెట్టు ఇస్తే గెలిపించుకుంటానని విన్నవించుకున్నాడు. దీంతో వారు ‘నీ భార్యను తీసుకొని వస్తేనే టిక్కెట్ ఇస్తాం’అని చెప్పడంతో లక్ష్మణ్ తన భార్య తరఫు బంధువులతో సంప్రదింపులు జరిపాడు. కాపురానికి వచ్చేలా ప్రయత్నాలు చేసి బుధవారం భార్య కవితను ఒప్పించారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ భార్యకు టికెట్టు కేటాయించారు. గురువారం బీఫాం ఆర్‌వోకు అందజేశారు. కాగా, పార్టీ టిక్కెట్ భార్యాభర్తలను ఏకం చేయడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. లక్ష్మణ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎంపీటీసీ ఎన్నికలు మమ్మల్ని కలుపడం సంతోషంగా ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment