వినాయక్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): నిజామాబాద్ నగరాభివృద్ధిలో భాగంగా నిజామాబాద్ నగరాభివృద్ధి సంస్థ (నుడా) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నుడా పరిధిలో నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న మొత్తం 61 గ్రామాలు ఉంటాయి. నుడా ఏర్పాటుకు మున్సిపల్ పరిపాలన శాఖ నుంచి ఉత్తర్వులు (జీఓనెం.271) జారీ అయ్యాయి. నుడాకు పాలకవర్గాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో నగరంతో పాటు నగర పరిసర గ్రామాల్లో అభివృద్ధి ఊపందుకోనుంది. ఈ నేపథ్యంలో నగర మున్సిపల్ కమిషనర్ జాన్ సాంసన్‌ను ‘సాక్షి’ ఇంటర్వూ్య చేసింది.
నుడా ఏర్పాటుతో అభివృద్ధి ఎలా ఉండబోతోంది?
కమిషనర్ : నిజామాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుతో నగరంతో పాటు నిజామాబాద్ చుట్టు పక్కల ఉన్న 61 గ్రామాల్లో అభివృద్ధి ఊపందుకుంటుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అందాల్సి ఉంది. నుడా ఏర్పాటుతో ప్రణాళిక బద్ధమైన అభివృద్ధితో పాటు ఆయా గ్రామాల్లో భూముల ధరలు పెరిగుతాయి. నగర సుందరీకరణ, అభివృద్ధి పనులు ఊపందుకుంటాయి.
నగరాభివృద్ధికి మంజూరైన నిధులతో చేపట్టబోయే పనులు ఎలా పూర్తి చేస్తారు?
కమిషనర్ : నగరాభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరయ్యాయి. వీటిని ప్రాధాన్యత క్రమంలో వినియోగిస్తాం. తొలుత రోడ్లు, అంతర్గత రోడ్ల పనులు చేపడతాం. తర్వాత డ్రెయిన్‌ల పనులు, అహ్మదీ బజార్ మాంస విక్రయ భవన సముదాయాల పనులు చేపడతాం. నిర్ణీత సమయంలో పనులు చేపట్టేందుకు అధికారులను సమన్వయ పరుస్తాం.
పారిశుధ్య నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు?
కమిషనర్ : పారిశుధ్య నిర్వహణ మెరుగుపర్చడానికి సిబ్బంది గైర్హాజరు కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బందికి పూర్తి స్థాయిలో సేఫ్టీ మెటీరియల్ అందుబాటులో లేదు. పారిశుధ్య పరికరాలు, యూనిఫాం, షూస్, సేఫ్టీ మెటీరియల్ అందించడంపై దృష్టి సారిస్తున్నాం. సిబ్బంది సహకారంతో శానిటేషన్ మెరుగుపరుస్తాం.
మున్సిపాలిటీలో సిబ్బంది కొరత ఉందా?
కమిషనర్ : నగర పాలక సంస్థలో సిబ్బంది కొరత లేదు. మున్సిపాలిటీలో మొత్తం 720 మంది సిబ్బంది ఉన్నారు. వీరితో ప్రస్తుతం సేవలను కొనసాగిస్తున్నాం. అవసరమనుకుంటే సిబ్బందిని నియమిస్తాం.
చెత్త సేకరణ వాహనాల కొరత ఉందా?
కమిషనర్ : చెత్త సేకరణ వాహనాల కొనుగోలుకు రూ.8కోట్లు మంజూరయ్యాయి. చెత్త సేకరణకు అవసరమైన వాహనాల జాబితాను ప్రభుత్వానికి పంపించి కొనుగోలు చేస్తాం. పబ్లిక్ హెల్త్ శాఖకు బాధ్యతలు అప్పగించాం.
శానిటరీ సిబ్బందిపై కొరడా ఝులిపిస్తున్నారు.. వేరే శాఖల అధికారులు బయోమెట్రిక్ చేసి వెళ్లిపోతున్నారనే ఆరోపణలున్నాయి?
కమిషనర్ : ప్రభుత్వ ఆదేశాల మేరకే సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నాం. ఎవరు క్రమశిక్షణ అతిక్రమించినా చర్యలు తీసుకుంటాం. ఎంతటి వారైనా సక్రమంగా విధులు నిర్వర్తించాల్సిందే. బయోమెట్రిక్ చేసి విధుల్లో నుంచి వెళ్తే ఉపేక్షించం. అలాంటి వారిపై పకడ్బందీ చర్యలు తీసుకోవడంపై దృష్టి సారిస్తాం.
యూజీడీ పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారు?
కమిషనర్ : యూజీడీ పనులు సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తాం. పనుల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు నగరాభివృద్ధికి సహకరించాలి.
Comments
Please login to add a commentAdd a comment