తండాలన్నీ ఎస్టీలకు కాదు! | New Gram Panchayat vs Thandas issues | Sakshi
Sakshi News home page

తండాలన్నీ ఎస్టీలకు కాదు!

Published Fri, Mar 2 2018 3:50 AM | Last Updated on Fri, Mar 2 2018 3:50 AM

New Gram Panchayat vs Thandas issues

సాక్షి, హైదరాబాద్‌ :  .. ఈ పరిస్థితి రెండు గ్రామ పంచాయతీలకే పరిమితం కావడం లేదు. కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటవుతున్న వందలాది తండాల్లో ఈ సమస్య తలెత్తనుంది. ఇతర వర్గాల ఓటర్లు కనీసం పది మంది కూడా లేనిచోట రిజర్వేషన్ల రొటేషన్లతో ఆయా వర్గాలకు సర్పంచ్‌ పదవి కేటాయించే పరిస్థితి ఉంటుంది. దీనితో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఎస్టీలకు పాలనా అవకాశం కల్పించాలన్న లక్ష్యం నీరుగారిపోనుంది. ఈ పరిస్థితిని ఊహించిన పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఏం చేయాలనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఈ ఇబ్బందిని అధిగమించేలా కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో ప్రత్యేకంగా నిబంధనలు చేర్చే విషయంపై న్యాయశాఖతో కలసి అధ్యయనం చేస్తున్నారు.

4,122 కొత్త పంచాయతీలు
రాష్ట్రంలో జనాభా ఎక్కువగా ఉన్న శివారు గ్రామాలు, పల్లెలు, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మైదాన ప్రాంతాల్లో 500 మంది జనాభా ప్రాతిపదికన.. కొండలు, గుట్టల ప్రాంతాల్లో, ప్రత్యేక భౌగోళిక ప్రాంతాల్లో 300 జనాభా ప్రాతిపదికన ఆవాసాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చేలా మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని 30 జిల్లాల నుంచి 4,122 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. అందులో 1,879 సాధారణ ఆవాసాలు, 2,243 తండాలు ఉన్నాయి. చివరిగా మరోసారి జిల్లాల నుంచి నివేదికలు తెప్పిస్తున్నారు. కొత్త పంచాయతీలతో కలిపి రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు మొత్తంగా 12,806కు చేరనున్నాయి.

957 కొత్త పంచాయతీల్లో సమస్యలు
స్థానిక సంస్థల ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి ఐదేళ్లకు సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్‌ మారుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని పదవులను పూర్తిగా ఎస్టీ వర్గం వారికే కేటాయిస్తారు. కానీ మైదాన ప్రాంతాల్లోని తండాల్లో రిజర్వేషన్ల రొటేషన్‌ సమస్య తలెత్తనుంది. రాష్ట్రంలో కొత్తగా 2,243 తండాలు గ్రామ పంచాయతీగా ఏర్పాటు కానుండగా.. ఇందులో 100 శాతం ఎస్టీ జనాభా ఉన్నవి 1,286 మాత్రమే. మిగతా 957 తండాల్లో ఇతర వర్గాలకు చెందినవారు కొద్ది సంఖ్యలో నివసిస్తున్నారు. దీంతో సర్పంచ్‌తోపాటు కొన్ని వార్డు సభ్యుల పదవులు ఇతర వర్గాలకు రిజర్వు అయ్యే పరిస్థితి ఉండనుంది.

ప్రత్యేక నిబంధనపై కసరత్తు!
గ్రామ పంచాయతీలుగా మారే తండాల్లోని ఓటర్లలో ఏ వర్గం వారు ఎంత మంది ఉన్నారన్న విషయంపై పంచాయతీరాజ్‌ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న తండాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు పూర్తిగా ఎస్టీ వర్గం వారికే రిజర్వు అయ్యేలా కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో నిబంధనను చేర్చాలన్న అంశాన్ని న్యాయ శాఖ దృష్టికి తీసుకువచ్చారు. ఇక కేవలం నలుగురైదుగురు ఇతర వర్గాల వారున్న పంచాయతీల్లో రిజర్వేషన్ల రొటేషన్‌ అంశంపైనా చర్చిస్తున్నారు. త్వరలోనే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది.

డీసీ తండా.. వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఒక గ్రామ పంచాయతీ. నాలుగు తండాలు కలిపి గ్రామ పంచాయతీగా ఉంది. సమీపంలోని ఓ గ్రామం నుంచి నలుగురు బీసీ వర్గం వారు డీసీ తండాలో స్థిరపడ్డారు. 2013 పంచాయతీ ఎన్నికల సమయంలో డీసీ తండా సర్పంచ్‌ పదవి రొటేషన్‌లో బీసీలకు వచ్చింది. నలుగురే ఓటర్లున్న వర్గానికి రిజర్వేషన్‌ రావడంతో గిరిజనులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దాంతో ఎవరూ నామినేషన్‌ వేయక, సర్పంచ్‌ ఎన్నిక జరగలేదు. వార్డు సభ్యులలో ఒకరు ఉప సర్పంచ్‌ అయ్యారు. ఆయనే ఇన్‌చార్జి సర్పంచ్‌గా వ్యవహరిస్తున్నారు.

రాంధన్‌ తండా.. వర్ధన్నపేట మండలంలోని మరో గ్రామ పంచాయతీ. ఒక్క కుటుంబం మినహా అంతా లంబాడీ తెగవారే. కానీ 2013 ఎన్నికలప్పుడు రిజర్వేషన్‌ రొటేషన్‌లో సర్పంచ్‌ పదవి బీసీలకు కేటాయించారు. ఉన్న ఒక్క కుటుంబంలోని వారే సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement