పాముకాటుకు కొత్త మందు | New Medicine To Snake Bite Over No Side Effects | Sakshi
Sakshi News home page

పాముకాటుకు కొత్త మందు

Published Thu, Jan 9 2020 2:01 AM | Last Updated on Thu, Jan 9 2020 2:52 AM

New Medicine To Snake Bite Over No Side Effects - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాముకాటుకు దుష్ప్రభావం లేని విరుగుడు మందు తయారు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. అలాగే పాముకాటు మందుకు కొరత లేకుండా ఆధునిక పద్ధతిలో ల్యాబొరేటరీల్లో తయారు చేసే విధానం కూడా అందుబాటులోకి రానుంది. ఈ విషయంలో భారతీయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు మంచి ఫలితాలిచ్చాయి. ‘నేచర్‌ జెనెటిక్స్‌’అనే వెబ్‌సైట్‌ తాజా సంచికలో ఈ వివరాలను ప్రచురించింది. ప్రస్తుతం పాముకాటు బాధితులకు వాడుతున్న యాంటీ వీనం సీరం అనే మందు కొన్నిసార్లు పని చేయకపోవడం, అనేక సందర్భాల్లో దుష్ప్రభావాలు కలిగే అవకాశాలున్నాయి. యాంటీ వీనం సీరం వేశాక కొంతమందిలో బీపీ పడిపోవడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం తదితర  పలు సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం పాము విషాన్ని గుర్రాల్లో ప్రవేశపెట్టి ప్రతిదేహకాలను (యాంటీ బాడీస్‌) ఉత్పత్తి చేస్తారు. వాటిని శుద్ధి చేసి యాంటీ వీనం సీరం తయారు చేస్తారు. అయితే గుర్రంలోని ప్రతిదేహకాలు, మనుషుల్లోని ప్రతిదేహకాలు ఒకటి కాదు కాబట్టి అనేకసార్లు దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. పూర్తిస్థాయిలో విరుగుడుగా పనిచేయట్లేవు. ఈ పరిస్థితికి చెక్‌ పెట్టేలా ఆధునిక పద్ధతిలో యాంటీ వీనం తయారు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు నేచర్‌ జెనటిక్స్‌ తెలిపింది. దీనివల్ల వంద శాతం సమర్థంగా పనిచేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.

తాచు పాములోని జన్యువుల డీకోడ్‌!
తాచుపాముల్లోని విషాన్ని ఉత్పత్తికి కారణమయ్యే 139 రకాల జన్యువులను పరిశోధకులు గుర్తించారు. అందులో 19 రకాలను సంక్లిష్టమైన జన్యువులుగా భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆధునిక పద్ధతిలో తాచు పాములోని జన్యువులను డీకోడ్‌ చేయడం ద్వారా వీటిని గుర్తించారు. మొదటిసారిగా భారతీయ తాచుపాముల విష సంబంధిత ట్యాక్సిన్‌ జన్యువుల పూర్తి జాబితా ఇప్పుడు మన వద్ద ఉందని నేచర్‌ జెనెటిక్స్‌ వెల్లడించింది. అత్యాధునిక జన్యు సాంకేతిక పరిజ్ఞానాల కలయికను ఉపయోగించి, మన నాగుపాములకు సంబంధించిన జన్యువులను కూడా శాస్త్రవేత్తలు సమీకరించారు. పాము కాటు మరణాలల్లో మూడో వంతు ఈ రకపు విషాలే కారణమని నిర్ధారించారు. వీటిని సింథటిక్‌ పద్ధతిలో లేబరేటరీల్లో యాంటీ వీనం తయారు చేసి ప్రస్తుత పాము కాటు మందును ఆధునీకరించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. గుర్రాల నుంచి తయారు చేయడం క్లిష్టమైన, శ్రమతో కూడిన వ్యవహారం. పైగా సీరం కొరత ఉండటంతో అనేకమంది పాము కాటుకు బలవుతున్నారు.

రాష్ట్రంలో 942 పాము కాటు కేసులు..
రాష్ట్రంలో గతేడాది మొదటి 8 నెలల్లో 942 పాము కాటు కేసులు నమోదయ్యాయి. మన దేశంలో 300 రకాల సర్పాలున్నాయి. అందులో 66 రకాల పాములు విషపూరితమైనవి. వాటిల్లో 61 రకాల పాముల్లో మనిషిని చంపేంత విషం ఉండదు. ఇక మిగిలినవే మనుషులకు ప్రాణాహాని. తెలంగాణలో 31 రకాల పాములున్నాయి. వాటిల్లో 6 పాములు మాత్రమే విషపూరితమైనవి. తాచు పాము, రక్తపింజర, కట్ల పాము, చిన్న పింజర ఈ నాలుగు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక లంబిడి గాజుల పాము (ఇదో రకం అరుదైన కట్ల పాము, ఇది ఏటూరునాగారం ఏరియాలోనే ఉంటుంది).. ఇంకోటి బ్యాంబూ బిట్‌ వైఫర్‌. ఇది అరుదైన రక్త పింజర. వీటిల్లో తాచు పాములే 48 శాతం ఉంటాయి. 33 శాతం జెర్రి గొడ్డు రకం పాములుంటాయి. తాచుపాము, కట్లపాము కరిస్తే నరాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. రక్తపింజర కరిస్తే రక్తపు వాంతులతో మరణిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కూలీలు, ఇతర పనులు చేసే వారిలో అనేక మంది పాము కా>ట్లకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో యాంటీ వీనం సీరం ఇంజక్షన్‌ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను, నాటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఎక్కువగా రాత్రి వేళల్లోనే పాము కాటుకు గురవుతారు. కానీ ఆ సమయంలో ప్రభుత్వాసుపత్రులు తెరిచి ఉండట్లేదు. దీంతో ఇబ్బందులు తప్పట్లేదు.

ఏటా వెయ్యి మంది..: 
డాక్టర్‌ మాదల కిరణ్, అనెస్థీషియా అండ్‌ క్రిటికల్‌కేర్‌ శాఖాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ దేశంలో అనధికారికంగా 46 వేల మంది చనిపోతున్నారు. రాష్ట్రంలో ఆ సంఖ్య వెయ్యి వరకు ఉంటుంది. దేశంలో శాస్త్రవేత్తలు తాచు పాములో అత్యంత కీలకమైన జన్యువులను గుర్తించారు. దీంతో ఆధునిక పద్ధతిలో ఎలాంటి దుష్ప్రభావాలు లేని యాంటీ వీనం కనుగొనే వీలు కలిగింది.
– డాక్టర్‌ మాదల కిరణ్, అనెస్థీషియా అండ్‌ క్రిటికల్‌కేర్‌ శాఖాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement