ప్రతీసారి ప్రవేశపెట్టే బడ్జెట్‌కు భిన్నంగా తమ బడ్జెట్ ఉంటుం దని ముందు నుంచీ చెప్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం, మిగతా కొన్ని సంప్రదాయాల్లోనూ భిన్నంగా వ్యవహరిస్తోంది.
నేరుగా అసెంబ్లీ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ప్రతీసారి ప్రవేశపెట్టే బడ్జెట్‌కు భిన్నంగా తమ బడ్జెట్ ఉంటుం దని ముందు నుంచీ చెప్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం, మిగతా కొన్ని సంప్రదాయాల్లోనూ భిన్నంగా వ్యవహరిస్తోంది. సాధారణంగా బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉదయం శాసనసభ స్పీకర్ అల్పాహార విందు ఏర్పాటు చేయటం ఆనవాయితీ. ఈసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వం దీన్ని అనుసరించకూడదని నిర్ణయించుకుంది. అధికారపక్షంపై దాడి చేసేందుకు ప్రతిపక్షాలు, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టి ఎదురుదాడికి దిగేందుకు పాలకపక్షం, సర్వసన్నద్ధమై అసెంబ్లీకి రావటం కద్దు. పరస్పరం కారాలుమిరియాలు నూరుకుంటున్నా... స్పీకర్ ఇచ్చే అల్పాహార విందులో మాత్రం వీరంతా ఎంతో అన్యోన్యతను ప్రదర్శిస్తూ ఫొటోలకు పోజులివ్వటం చాలాకాలంగా వస్తున్న పద్ధతి. కానీ ఈసారి ఆ దృశ్యం కనిపించదు. అల్పాహార విందు తంతు లేకుండా స్పీకర్ నేరుగా సభను ప్రారంభించబోతున్నారు.