
నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ కేంద్రంకు సంబంధించిన పైలాన్ నమూనా
- రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై నిరాసక్తత
- 4 వేల మెగావాట్ల జెన్‌కో ప్లాంట్‌కేపరిమితం
- దేశంలోనే అతిపెద్ద థర్మల్ కేంద్రానికి బ్రేకులు!
హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్లలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఎన్టీపీసీ విముఖత ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ జెన్‌కో ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దామరచర్లలో జెన్‌కో ఆధ్వర్యంలో 5,200 మెగావాట్లు, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 2,400 మెగావాట్లు కలిపి మొత్తం 7,600 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ కేంద్రాలను నిర్మించాలని ప్రభుత్వం భావించింది. స్థల పరిశీలన కోసం గత డిసెంబర్‌లో సీఎం కేసీఆర్ దామరచర్లలో ఏరియల్ సర్వే జరిపిన సమయంలోనే ఈ విషయాన్ని ప్రకటించారు. 7,800 ఎకరాలను ఈ ప్రాజెక్టు కోసం సేకరించాలని అప్పట్లో నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో జెన్‌కో యంత్రాంగం అటవీ భూముల సమీకరణ, పర్యావరణ అనుమతులు, సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పనుల్లో తలమునకలైంది. 4,700 ఎకరాల అటవీ భూములను కేటాయించేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఇటీవల అంగీకారం తెలిపింది. అయితే, అక్కడ 2,400 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మించే ందుకు ఎన్టీపీసీ ఆసక్తికనబరచలేదు. దీంతో అక్కడ జెన్‌కో ఆధ్వర్యంలో కేవలం 4వేల (5ఁ800) మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దామరచర్ల విద్యుత్ కేంద్రం సామర్థ్యం 4 వేల మెగావాట్లకు పరిమితం కావడంతో దేశంలోనే అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు బ్రేకులు పడినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎన్టీపీసీ ఔట్ ?
తెలంగాణలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. విభజన చట్టం హామీ అమలులో భాగంగా 1600 (2ఁ800) మెగావాట్ల సామర్థ్యంతో రామగుం డం ప్లాంట్ విస్తరణ పనులను ఎన్టీపీసీ చేపట్టింది. పర్యావరణ ప్రభావంపై అధ్యయనం సైతం పూర్తి చేసింది. మిగిలిన 2,400 మెగావాట్ల ప్లాంట్లను నిర్మించేందుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాల్సి ఉంది.దామరచర్లలో ఎన్టీపీసీ ఆసక్తిచూపకపోవడానికి బొగ్గు రవా ణా ఖర్చుల భారంతోపాటు ఇతర కారణాలు వున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.