నుమాయిష్‌ను ప్రారంభిస్తున్న మంత్రులు తలసాని, మహమూద్ అలీ, ఈటల
అఫ్జల్‌గంజ్: భాగ్యనగరంలో ఏటా జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)ను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులు లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా వనిత మహావిద్యాలయ విద్యార్థులు వందేమాతరం గీతాలాపన చేసిన అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. గత 79 ఏళ్ల నుంచి ఎగ్జిబిషన్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న సొసైటీ సభ్యులను మంత్రి మహమూద్ అలీ అభినందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్‌లో తెలంగాణ సంస్కృతైన గంగా జమునా తైజీబ్ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోందని అన్నారు. ఎగ్జిబిషన్‌ను కేవలం 45 రోజులకే పరిమితం చేయకుండా ఏడాదిలో పలుమార్లు నిర్వహిస్తే ఎందరికో ఉపాధి కల్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ ద్వారా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలతోపాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసి తమ వస్తువులకు ప్రచారం చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారని తెలిపారు. తద్వారా జనవరి వచ్చిందంటే చాలు ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుందని అన్నారు. గతేడాది అగ్ని ప్రమాద అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.
ఆదాయంతో 30 వేల మందికి విద్య..
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల నుంచి వివిధ రకాల ఉత్పత్తులతోపాటు ప్రముఖ కంపెనీల వస్తువులు ఎగ్జిబిషన్‌లో దొరుకుతాయని మంత్రి ఈటల అన్నారు. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్‌తో కలసి రాష్ట్రంలోని 18 విద్యాలయాల ద్వారా ఏటా సుమారు 30 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వసతి సౌకర్యాలు కల్పిస్తున్న ఏకైక సంస్థగా ఎగ్జిబిషన్ సొసైటీ నిలుస్తుందని కొనియాడారు.
నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. గత అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి అండర్‌గ్రౌండ్ వైరింగ్, వాటర్ సిస్టమ్‌తోపాటు మరెన్నో జాగ్రతలు తీసుకున్నామని అన్నారు. ఇక ఎగ్జిబిషన్‌కు అనుమతి ఆలస్యంగా రావడంతో స్టాల్స్ ఏర్పాటు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు ఎన్.సురేందర్, కోశాధికారి ఎన్.వినయ్‌కుమార్, సంయుక్త కార్యదర్శి బి.హన్మంతరావు, మెంబర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment