
సమావేశంలో మాట్లాడుతున్న చెరుకు సుధాకర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారని, ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఓయూ జేఏసీ, తెలంగాణ మాదిగ దండోరా, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ‘భారత రాజ్యాంగం– చట్టాల దుర్వినియోగం’ అనే అంశంపై సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఓయూ జేఏసీ ప్రతినిధి చారకొండ వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, తెలంగాణ మాదిగ దండోరా అధ్యక్షుడు దేవర సతీష్ మాదిగ, ప్రొఫెసర్ అన్సారీ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ కన్నా రాష్ట్రంలో కల్వకుంట్ల కరోనా భయంకరంగా ఆవరించిందన్నారు. ప్రశ్నించినందుకు గతంలో మంద కృష్ణను రెండు నెలలు జైలులో పెట్టారని, తర్వాత ఎంతో మంది విద్యార్థి నాయకులను, ప్రొఫెసర్లను మావోయిస్టు బూచి చూపి అరెస్టులు చేశారన్నారు.
ప్రస్తుతం 111 జీవోలో అక్రమ కట్టడాలు బయటపెట్టినందుకు రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించినందుకు రేవంత్‌ను జైలులో పెడితే ఎన్నో వాగ్ధానాలు ఇచ్చి నెరవేర్చని ముఖ్యమంత్రిని కూడా జైలులో పెట్టాలన్నారు. రేవంత్ ఏమైనా తీవ్రవాదా..? స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో అక్రమంగా మరో 12 కేసులు బనాయించి బెయిలు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఒక జాతీయ పార్టీ ఎంపీని అక్రమంగా అరెస్టు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదో అర్థం కావడంలేదన్నారు.
ఒకే పార్టీకి చెందిన తోటి ఎంపీని అక్రమంగా అరెస్టు చేస్తే అదే పార్టీ నాయకులు ఎంపీకి వ్యతిరేకంగా మాట్లాడడం దుర్మార్గమని, మీరు అవలంభించిన విధానం వల్ల ఇకపై ఎవ్వరూ ఆ పార్టీలో చేరేందుకు జంకుతారని, ప్రస్తుతం పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ప్రశ్నార్థకంలో పడ్డారన్నారు. ఢిల్లీ నుంచి హైకమాండ్ ఒక న్యాయవాదిని పంపించారని, ఈ విషయమై రాష్ట్ర కాంగ్రెస్ సిగ్గుపడాలన్నారు. సమావేశంలో ఓయూ జేఏసీ నాయకులు దరువు ఎల్లన్న, దుర్గం భాస్కర్, రెడ్డి జాగృతి నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వివిధ సంఘాల నాయకులు దుర్గయ్య గౌడ్, రమేష్, రామ్మూర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. (తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు)
Comments
Please login to add a commentAdd a comment