
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా
చిలుకూరు : ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిపించాలని కోరుతూ యువతి ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఆపై న్యాయం చేయాలని కోరుతూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. మండలంలోని దుదియాతండాకు చెందిన బాణావత్ దేవిక, అదే గ్రామానికి చెందిన భూక్యా శ్రీకాంత్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను దేవిక తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ ఏడాది జూన్ నెలలో దేవికకు వేరేవ్యక్తితో వివాహం జరిపించారు. అయితే అప్పటి నుంచి శ్రీకాంత్ మళ్లీ వివాహం చేసుకుంటానని దేవికను వేధించసాగాడు. పెళ్లిచేసుకోకపోతే చనిపోతానని బెదిరించాడు. అతడి మాటలను నమ్మి దేవిక తన భర్తకు విడాకులు ఇచ్చింది. తీరా వివాహం చేసుకోవాలని అడిగితే తమ తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదంటూ శ్రీకాంత్ ముఖం చాటేశాడు.
గ్రామంలో ఉద్రిక్తత
శ్రీకాంత్ ఇంటి ఎదుట దేవిక ధర్నాకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావారణం చోటు చేసుకుంది. శ్రీకాంత్ తల్లిదండ్రులు దేవికతో ఘర్షణ పడి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.