జమ్మికుంట(హుజూరాబాద్): వచ్చే ఏడాది రాష్ట్రంలోని రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేస్తామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా జమ్మి కుంటలో మున్నూరుకాపు కులస్తులు ఈటలకు మద్దతుగా ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. సభలో మంత్రి మాట్లాడుతూ, ఈసారి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వమే రుణం చెల్లిస్తుందని, బ్యాంకర్లు ఎవరూ ఇబ్బంది పెట్టకుండా చూస్తామని వివరించారు. రైతులు ప్రమాదవశాత్తు మృతి చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా రూ.5 లక్షలు అందించేలా బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, ఈ పథకాన్ని అన్ని కుటుంబాలకు వర్తింపజేస్తామని వెల్లడించారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తోందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఇంట్లోకి వస్తున్న 24 గంటల కరెంటే సాక్ష్యమన్నారు. ప్రజలంతా టీఆర్‌ఎస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శారద, ఈటల సతీమణి జమున, మున్నూరు కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment