సాక్షి, ఖమ్మం: మెదక్ జిల్లాలో స్కూల్ బస్సును రైలు ఢీకొని అనేకమంది చిన్నారులు మృతిచెందిన దుర్ఘటన కలిచివేసిందని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గురువారం పార్లమెంట్ జీరో అవర్‌లో మాట్లాడారు. నిండా పదేళ్లు కూడా లేని చిన్నారులు మృతిచెందారని, ఈ ప్రమాదంలో స్కూల్ యాజమాన్య తప్పిదం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందని అన్నారు. రైలు నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చి చిన్నారుల ప్రాణాలను గాలిలో కలిపేసిందని అన్నారు.
రైల్వే క్రాసింగ్ వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డు లేనందునే ఈ ప్రమాదం జరిగిందని, దీనికి రైల్వే శాఖ నిర్లక్ష్యమే కారణమని అన్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన చిన్నారుల కుటుంబాలకు 25లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు ప్రభుత్వమే మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా రైల్వే క్రాసింగుల వద్ద గేటు ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించాలని సూచించారు.
వైఎస్‌ఆర్ సీపీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు సంతాపం
దమ్మపేట: మెదక్ జిల్లా ముసాయిపేట వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో చిన్నారుల మృతి కలిచివేసిందని అశ్వారావుపేట ఎమ్మె ల్యే, వైఎస్‌ఆర్ సీపీ శాసనసభాపక్ష నాయకుడు తాటి వెంకటేశ్వర్లు విచారం వ్యక్తం చేశా రు. ఆయన గురువారం ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. లెవల్ క్రాసింగ్ వద్ద సిబ్బంది లేనందునే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ దుర్ఘటనకు రైల్వే అధికారుల నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. మృతిచెందిన చిన్నారుల కుటుంబాలకు పెద్ద మొత్తంలో ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. మృతిచెందిన చిన్నారులకు తెలంగాణ వైఎస్‌ఆర్ సీపీ పక్షాన సంతాపం తెలిపారు.
వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్ దిగ్భ్రాంతి
వైరా: మెదక్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన దారుణమైనదని, అనేకమంది చిన్నారులు మృతిచెందారన్న వార్త దిగ్భ్రాంతిగొల్పిందని వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. అనుభవం లేని డ్రైవర్‌న పంపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠ శాల యాజమాన్యంపై ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. రైల్వే శాఖ ఇప్పటికైనా స్పందించి, లెవ ల్ క్రాసింగ్ వద్ద గేట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణమే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
బస్సు ప్రమాదం బాధాకరం
Published Fri, Jul 25 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM
Advertisement