సాక్షి, హైదరాబాద్: కోతల కరెంటు... అరకొర రుణమాఫీ...పత్తాలేని ఫీజు రీయింబర్‌సమెంట్... దిక్కూమొక్కూ లేకుండా పోయిన పింఛ న్లు... ఇది బంగారు తెలంగాణ కాదు.. బాధల తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందాలు చేసుకుని వెలుగులు అని ప్రచారం చేసుకుంటున్న సీఎం అసలు ఆ కరెంట్ ఎన్నాళ్లకు వస్తుందో చెప్పగలరా అని ప్రశ్నించారు. మంగళవారం గాంధీభవన్‌లో పొన్నాల విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో రూ.6 లక్షల కోట్ల హామీలు ఇచ్చిన విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. పునర్విభజన చట్టం కల్పించిన హక్కులను సాధించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. పంటల సమయంలో రాజకీయం చేసి, ఐదు నెలల తరువాత తీరిగ్గా ఒప్పందాలు చేసుకుంటే ఏం ఒరుగుతుందని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని, విపక్షాలు నిలదీస్తాయని ఆందోళన చెందే ఛత్తీస్‌గఢ్ వెళ్లారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ దక్షిణాది ముఖ్యమంత్రుల మండలి అధ్యక్షుడై కూడా కరెంటు సమస్యను సమస్యను నివారించలేకపోతున్నారని అన్నారు. భూపాపల్లి థర్మల్ పవర్ ప్రాజెక్టు 3వ యూనిట్, కంతనపల్లి హైడ్రోపవర్ ప్రాజెక్టులను ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ‘ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను మా సభ్యులు ప్రజల ముందు ఉంచుతారు. రాజకీయాలు మాని ప్రజల గురించి ఆలోచించండి. ప్రభుత్వ అసమర్ధతను మాపై రుద్దకండి..’ అని చురక అంటించారు. నీటి పంపకంలో కృష్ణా బోర్డు విధానాలు న్యాయబద్ధంగా, సమంజసంగా లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విద్యుత్తు రాకుండా అడ్డుకుంటున్నారని ఏపీ సీఎం చంద్రబాబును నాలుగున్నర నెలల తరువాత కేసీఆర్ విమర్శిస్తున్నారని, బాబు విద్యుత్ దోపిడీపై ఇంతకాలం రాష్ట్రపతి, ప్రధానిని ఎందుకు కలవలేదని పొన్నాల ధ్వజమెత్తారు.
బంగారు కాదు ... బాధల తెలంగాణ
Published Wed, Nov 5 2014 2:42 AM | Last Updated on Thu, Jul 11 2019 5:33 PM
Advertisement