పేదల సంక్షేమమే ఎజెండా
- కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
- సమన్వయంతో పని చేయండి
- మంచి పనులు చేసి జనం మదిలో ఉండండి
- ప్రజలతో పాలునీళ్లలా కలసిపోతేనే ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ‘పదవులు వస్తుంటాయి. పోతుంటాయి... ఎంత బాగా పని చేశామన్నదే జీవితంలో సంతృప్తినిస్తుంది. మనకంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులు, మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు, ఎస్పీలుగా పనిచేశారు. మంచి పనులు చేస్తే పాతికేళ్ల కిందట పని చేసిన కలెక్టర్లను నేటికీ ఆయా జిల్లాల ప్రజలు మరిచిపోని సందర్భాలున్నాయి. మనకు వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటామనేదే కీలకం. మంచి పనులు చేయటం, ప్రజల ఆశలకు తగ్గట్లుగా పని చేయటంలో ఉన్నంత సంతృప్తి ఇంకెక్కడా లభించదు. హోదాలు, గౌరవాలకు మించి అన్నార్తులు, దీనార్థులైన నిరుపేద ప్రజలకు అందించే సేవలో నుంచి వచ్చే తృప్తి అమూల్యమైనది...’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లకు హితబోధ చేశారు.
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని...అధికారులు కూడా ఇదే స్ఫూర్తితో పని చేయాలని కోరారు. ప్రభుత్వ పథకాలు అట్టడుగు స్థాయి వరకు చేరాలని, పూర్తి పారదర్శకతతో వేగవంతంగా పనులు జరగాలని చెప్పారు. సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు. గతంలో వివిధ సంక్షేమ కార్యక్రమాలకు రూ. 8,700 కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం సంక్షేమానికి రూ. 27 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తోందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సదస్సులో మంత్రులు, పార్లమెంటరీ సెక్రటరీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ప్రభుత్వ కార్యదర్శులు, కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, జెడ్పీ చైర్‌పర్సన్లు, మేయర్లు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. తొలి రోజున పురపాలకశాఖ, వాటర్‌గ్రిడ్, ఆసరా పింఛన్లు, స్వచ్ఛ భారత్-స్వచ్ఛ తెలంగాణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. సదస్సులో వివిధ అంశాలపై కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
పేదరిక నిర్మూలనే ఎజెండా...
పేదరిక నిర్మూలనే ప్రభుత్వ ప్రప్రథమ కర్తవ్యం. దానికి అనుగుణంగానే టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళిక తయారు చేసుకున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ రెండో ప్రాధాన్యం. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది.
వాటర్‌గ్రిడ్ ఓ చాలెంజ్...
వచ్చే ఎన్నికల్లోగా రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీరు అందించకపోతే మళ్లీ ప్రజలను ఓట్లు అడగమని చెప్పాం. అందుకే దీన్ని చాలెంజ్‌గా తీసుకున్నాం. డ్రింకింగ్ వాటర్‌గ్రిడ్ పనులను మీరు (కలెక్టర్లు) పర్యవేక్షించాలి. రైట్ ఆఫ్ వేకు చట్టం తెచ్చినందున పైపులైన్ల నిర్మాణానికి ఆటంకాలు రాకుండా చూడాలి. శాఖల మధ్య సమన్వయం కుదర్చాలి. వ్యవసాయ భూముల్లో ఆరు అడుగుల లోతున పైపులైన్లు నిర్మించాలి.
చెరువులకు పునర్వైభవం
కాకతీయ రెడ్డి రాజులు తెలంగాణకు అందించిన గొప్ప వరం చెరువులు, చిన్ననీటి పారుదల వ్యవస్థ. 1956కు ముందు తెలంగాణలో సాగులో ఉన్న 20 లక్షల ఎకరాల్లో 15 లక్షల ఎకరాలకు చిన్ననీటి పారుదల ద్వారానే నీరందేది. ఆ విషయాన్ని ధ్రువీకరిస్తూ 1974లో జస్టిస్ బచావత్ నీటి కేటాయింపులు జరిపారు. అప్పటికే నిర్మితమైన చెరువులకు గోదావరి బేసిన్‌లో 175 టీఎంసీలు, కృష్ణా బేసిన్‌లో 90 టీఎంసీల నీటిని కేటాయించారు. అంత మొత్తం నీరు నిండితే మూడేళ్లపాటు కరువు మన ఛాయల్లోకి రాదు. కానీ గత పాలకుల నిర్లక్ష్యంతో ఈ చెరువులు కబ్జాలకు గురికావడంతోపాటు పూడిక నిండి ఆనవాళ్లు కోల్పోయాయి. అందుకే నాటి చెరువుల పునర్వైభవానికి మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టాం.
పక్కాగా ల్యాండ్ బ్యాంక్
ఆధునిక ప్రపంచ పోకడలకు అనుగుణంగా రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ రంగం వృద్ధి చేసుకోవాలి. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా మనకు భూమి అందుబాటులో ఉంది. మరోసారి సమగ్రంగా సర్వే చేయించి ల్యాండ్ బ్యాంక్‌ను స్థిరీకరించండి. పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు వీలుగా ల్యాండ్ బ్యాంక్ వివరాలుండాలి. ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పనులు వేగంగా చేపట్టాలి.
ప్రజలతో మమేకమవండి
పరిపాలనా సౌలభ్యానికి వీలుగా వేర్వేరు విభాగాల్లో పని చేస్తున్నా అందరం కలసి పని చేయాలి. అందరం ఏకతాటిపై ఉంటేనే ఫలితాలు వస్తాయి. ప్రజలకు ప్రభుత్వమంటే దూరమనే భావన ఉంది. పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వంలో పనులు జరగవనే అభిప్రాయాన్ని పారదోలాలి. మనం ప్రజల్లో పాలునీళ్లలా కలసిపోవాలి.
కరెంటు కోతలుండవు
దామరచర్ల తదితర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పూర్తయితే కరెంటు కోతలు ఇంచుమించుగా ఉండవు. ఈ ఏడాది విద్యుత్ కొనుగోళ్లతోపాటు పక్కా ప్రణాళిక ప్రకారం నడుచుకోవటంతో కరెంటు సమస్యను అధిగమించాం. కొత్త విద్యుత్ ప్లాంట్లు, లైన్ల నిర్మాణానికి అవసరమైన సందర్భాల్లో విద్యుత్‌శాఖకు మీరు (కలెక్టర్లు) పూర్తి సహకారం అందించాలి.
జిల్లాల్లోనూ ‘షీ టీమ్స్’
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మహిళల భద్రత, రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్‌లో అమలుచేస్తున్న ‘షీ టీమ్స్’ను అన్ని జిల్లాల్లోనూ ప్రారంభించాలి. అమ్మాయిలు, విద్యార్థినులపై ర్యాగింగ్‌ను ఉపేక్షించొద్దు. బాధిత మహిళలకు సకాలంలో వైద్యం, ఇతర సహాయ చర్యలు తీసుకునేందుకు ప్రతి జిల్లాలో వన్ స్టాప్ రిసోర్స్ సెంటర్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి.
ఆహార కార్డులపై నేడు స్పష్టత
రాష్ట్రంలో జనవరి నుంచి అమలు చేస్తున్న ఆహార భద్రతా పథకం కార్డుల జారీ, అమలుపై సీఎం కేసీఆర్ శనివారం కలెక్టర్ల సదస్సుల్లో అధికారులకు మార్గదర్శనం చేయనున్నారు. అనర్హుల తొలగింపు, కార్డుల జారీకి నిర్ణీత గడువు విధింపు, దీపం పథకం లబ్ధిదారుల ఎంపిక, లెవీ ఎత్తివేత తదితరాలపై స్పష్టత ఇవ్వనున్నారు. సదస్సు దృష్టికి తేవాల్సిన అంశాలపై పౌర సరఫరాలశాఖ అధికారులు ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేశారు.