పెద్దశంకరంపేట సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్లు
ఏళ్ల తరబడి వేధిస్తున్న విద్యుత్ సమస్యలకు పరిష్కారం లభించనుంది. నిత్యం గ్రామాల నుంచి పట్టణాల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ఇతర సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఈ సమస్యలకు ప్రభుత్వం చెక్ చెప్పనుంది. జిల్లా వ్యాప్తంగా ఇటీవల ‘పవర్ వీక్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందు లో ప్రజల నుంచి సమస్యల వివరాల ను సేకరించారు. దీనికి అనుగుణం గా 60 రోజుల ప్రణాళిక రూపొందించారు.
సాక్షి, పెద్దశంకరంపేట(మెదక్) : విద్యుత్ సమస్యలను ప్రజల భాగస్వామ్యంతో గుర్తించి వాటిని క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు ట్రాన్స్‌కో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో విద్యుత్‌శాఖ అధికారులు ఈ నెల 19 నుంచి 26 వరకు పవర్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్‌శాఖ అధికారులకు సమస్యల వివరాలను పూర్తిగా తెలుసుకొని సమస్యల పరిష్కారానికి ప్రణాళికలను రూపొందించాలని ఏఈలను, సిబ్బందిని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడడంతో పాటు సబ్‌స్టేషన్ల మరమ్మతు, శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయడం.
వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలోని సమస్యలను పూర్తిగా పరిష్కరించనున్నారు. వీటిపై పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 13,159 స్పాన్స్ (కొత్త స్తంభాల ఏర్పాటు)ను గుర్తించారు. ముందుగా గ్రామాలు, పట్టణాల్లో గృహ, వాణిజ్య అవసరాల తర్వాత వ్యవసాయానికి అందించే విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 అంశాలపై సమగ్ర సర్వేపవర్ వీక్‌లో భాగంగా విద్యుత్‌శాఖ అధికారులు ప్రధానంగా 17 సమస్యలపై సర్వే చేపట్టారు. ఇందులో 11 కేవీ, ఎల్‌టీ లూజ్ లైన్లు సరిచేయడం, శిథిలావస్థకు చేరిన, పాడైపోయిన, తుప్పుపట్టిన విద్యుత్ స్తంభాలను గుర్తించడం.
పాడైన స్టే వైర్లు, స్టర్డ్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఎర్తింగ్, కాలిపోయిన, పాడైపోయిన విద్యుత్ కేబుల్స్ మార్చడం. ఏబి స్విచ్‌లను, హెచ్‌జీ స్విచ్‌లను బాగు చేయడం, రోడ్డు క్రాసింగ్‌పై వైర్ల ఎత్తు పెంచడం, అవసరమైన చోట నూతన ఎస్‌బీ స్విచ్‌లను ఏర్పాటు చేయడం. వీధి దీపాల పనులు, స్ట్రీట్ లైట్ల కోసం ప్రత్యేకంగా విద్యుత్‌మీటర్లు ఏర్పాటు చేయడం. ఎంసీబీల ఏర్పాటు, గ్రామాలలో పాడైపోయిన స్ట్రీట్‌లైట్‌ల మీటర్లు మార్చడంతో పాటు వీటికి అవసరమైన 3, 5వ వైర్లు లాగడం (దీని వల్ల పగలు విద్యుత్ బల్బ్‌లు వెలగకుండా ఉంటాయి) వంటి పనులు చేపడుతున్నారు.
ప్రతీ సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేయనున్న ప్రత్యేక బృందాలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు 60 రోజుల ప్రణాళికను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రతీ సబ్‌స్టేషన్‌ను ప్రత్యేక బృందం తనిఖీలు చేస్తుంది. ఆయా సబ్‌స్టేషన్లలో లోపాలు గుర్తించడంతో పాటు పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌లు, ఎర్తింగ్ ఆయిల్ లెవల్, బ్రేకర్, బ్యాటరీల పనితీరు, ట్రిప్పింగ్ కాయిల్స్, ఏబి స్విచ్‌లకు కావలసిన పరికరాలపై నివేదికలను రూపొందిచనున్నారు.
ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో
విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయనున్నారు. వారితో కలిసి గ్రామాల్లో అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్థంభాల ఏర్పాటు, వీధిలైట్లకు మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో విద్యుత్ సమస్యలను పూర్తిగా నివారించడమే కాకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్‌ను అందించే వీలుంటుంది.
60 రోజుల్లో..
‘పవర్‌వీక్’ కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో గుర్తించిన సమస్యలకు 60 రోజుల్లోగా పరిష్కారం లభించనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గృహ, వాణిజ్య, వ్యవసాయానికి అందే విద్యుత్ సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా, విద్యుత్ వృథా కాకుండా గ్రామాలు, పట్టణాల్లో 3,5వ లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రీనాథ్, ట్రాన్స్‌కో, ఎస్‌ఈ మెదక్
Comments
Please login to add a commentAdd a comment