యాసిడ్ తాగించి, సిగరెట్లతో కాల్చి...
హైదరాబాద్ : సవతి తల్లి చేతిలో చిత్ర హింసలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష ఆరోగ్యంపై అవేర్ ఆస్పత్రి వైద్యులు శుక్రవారం హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ప్రత్యూష ఆరోగ్యం నిలకడగానే ఉందని, వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. ఆమె శరీరంపై బలమైన గాయాలు ఉన్నాయని, అన్నింటికీ చికిత్స చేసినట్లు చెప్పారు. ఆమె అంతర్గత (ప్రయివేట్ పార్ట్స్)అవయవాలపై యాసిడ్తో దాడి చేశారని, సిగరెట్లతో కాల్చి, యాసిడ్ కూడా తాగించినట్లు అవేర్ వైద్యులు వెల్లడించారు. సకాలంలో ప్రత్యూషను పోలీసులు ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని చెప్పారు.
సవతి తల్లి చాముండేశ్వరి ఏడాది కాలంగా ప్రత్యూష గదిలో నిర్బంధించి చిత్రహింసలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న మానవ హక్కుల కమిషన్, పోలీసులు బాధితురాలి ఇంటిపై దాడిచేసి ఆమెను బుధవారం గృహనిర్బంధం నుంచి విముక్తి కలిగించిన సంగతీ విదితమే. ప్రస్తుతం ప్రత్యూషకు రీనల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి, గ్యాస్ట్రో, గైనకాలజీ, పల్మనాలజీ విభాగాల వైద్యులతో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను బంధువులు కూడా పట్టించుకోవటం లేదు.