
నానక్‌రాంగూడలో సైకో వీరంగం
- రోడ్డుపై రెండు గంటలపాటు హంగామా
- రాళ్లు విసరడంతో ఆటోడ్రైవర్ తలకు గాయం
- అదుపులోకి తీసుకొని వదిలేసిన పోలీసులు
రాయదుర్గం: నానక్‌రాంగూడ ప్రధాన రోడ్డులో గురువారం ఉదయం ఓ సైకో వీరంగం సృష్టించాడు. రెండు గంటలపాటు హంగామా చేశాడు. రాళ్లు రువ్వడంతో ఓ ఆటో డ్రైవర్ గాయపడ్డాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనికి కౌన్సెలింగ్ నిర్వహించి వదిలిపెట్టారు. వివరాలు ఇలా... స్థానిక ట్రెండ్‌సెట్ అపార్ట్‌మెంట్ రోడ్డు నుంచి పోచ మ్మ దేవాల యానికి వెళ్లే ప్రధాన రోడ్డులో గుర్తుతెలియని రెండుగంటలపాటు హంగామా సృష్టించాడు.
నడుచుకుంటూ వెళ్లే వారిని నానా దుర్భాషలాడడంతోపాటు తోసేశాడు. ద్విచక్రవాహనాలను, కార్లను అడ్డుకొన్నాడు. దీంతో అరగంటపాటు వాహనాలన్నీ నిలిచిపోయాయి. స్థానికులు పోలీ సులకు సమాచారమిచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులను కూడా అతను దుర్భాషలాడాడు. పోలీసులు హెచ్చరించడంతో పక్కకు తప్పుకున్నాడు. కొద్దిసేపటికి మళ్లీ రోడ్డుపైకి వచ్చి వీరంగం చేయడం ప్రారంభించాడు. దారిలో వెళ్లేవారిపై రాళ్లు విసరడం ప్రారంభించాడు. దీంతో ఆటో డ్రైవర్ మునవర్ తలకు గాయం కాగా రక్తస్రావమైంది. వెంటనే అతడు ఆసుపత్రికి వెళ్లాడు.
ఆ సమయంలో స్థానికులు కొందరు అతని చేతులను తాళ్లతో బంధించి పోలీసులకు మరోమారు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి అతణ్ణి తీసుకెళ్లడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్టేషన్‌లో దాదాపు రెండు గంటల సేపు మాట్లాడగా అతని గురించి ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో పోలీసులు అతనికి కౌన్సెలింగ్ నిర్వహించి వదిలేశారు.