
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం పథకంలో భాగంగా హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఇళ్లను చూడాలని ముచ్చటపడ్డ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి రామ్‌కృపాల్ యాదవ్ కంగుతినాల్సి వచ్చింది. రాజధానిలో వాటి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని అధికారులు పేర్కొనడంతో ఆయన అవాక్కయ్యారు. గ్రామీణాభివృద్ధిశాఖ పథకాల అమలుపై సమీక్షించేందుకు రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన ఆయన జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలసి సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఈవై) ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించారు.
కేంద్రం మంజూరు చేసే ఈ ఇళ్లను తెలంగాణలో రెండు పడక గదుల ఇళ్ల పథకంలో కలిపేశారు. గతంలోనే కేంద్రం దీనికి అంగీకరించింది. డబుల్ బెడ్రూం స్కీం వినూత్నంగా ఉండటంతో ఆ ఇళ్లను చూడాలని తాను కొంతకాలంగా ఉత్సుకతతో ఉన్నట్లు పేర్కొన్న కేంద్రమంత్రి, నగర శివారులో నిర్మిస్తున్న గ్రామీణ ఇళ్లను చూసి ఢిల్లీకి వెళ్తానని అధికారుల దృష్టికి తెచ్చారు. కానీ ఇప్పటివరకు నగరంతోపాటు శివార్లలో ఎక్కడా ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. కేవలం సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలోనే పూర్తయ్యాయి.
ఇదే విషయాన్ని అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. నాలుగేళ్లలో ఇళ్ల నిర్మాణం జరగకపోవటమేంటని మంత్రి జూపల్లిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయన ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని రామ్‌కృపాల్ యాదవ్ దీనిపై బీజేపీ నేతలను అడిగారు. రాష్ట్రంలో ఆ పథకం విఫలమైందని వారు పేర్కొనగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి రెండు విడతల్లో కేటాయించిన 1.87 లక్షల ఇళ్లను విడిగా నిర్మించినా ఈపాటికి పూర్తయ్యేవి కదా అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రం తీరు వల్ల ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లకు కూడా అన్యాయం జరిగినట్టే కదా అని అభిప్రాయపడ్డారు.