సాక్షి, హైదరాబాద్: కిందిస్థాయి ఆస్పత్రుల్లో నయమయ్యే చిన్నపాటి వ్యాధులకూ గాంధీ, ఉస్మానియా వంటి పెద్దాస్పత్రులకు రోగులు పరుగులు తీస్తున్నారు. స్థానికంగా ఉండే సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ), ఏరియా, జిల్లా ఆస్పత్రులున్నా రోగులు ఉపయోగించుకోవడంలేదు. పైగా అక్కడి డాక్టర్లూ రిస్క్ తీసుకోకుండా పై ఆస్పత్రికి పంపిస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్ర వైద్య విద్యా డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో రిఫరల్ వ్యవస్థను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు. చిన్న జబ్బులకు కిందిస్థాయిలోనే సరైన వైద్యం అందేలా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ అక్కడ వైద్యం అందని పరిస్థితి ఉంటే అక్కడి వైద్యుడి సలహా మేరకే పై ఆస్పత్రికి వెళ్లాలి. కిందిస్థాయి ఆస్పత్రుల్లో వైద్యం అందించని పరిస్థితి ఉంటే వైద్యుడు తప్పనిసరిగా లిఖిత పూర్వకంగా పైఆస్పత్రికి రాసి పంపాలి.
వైద్య విధాన పరిషత్‌లోనూ స్పెషలిస్టులు
రాష్ట్రవ్యాప్తంగా 110 వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులున్నాయి. వాటిలో జిల్లా, ఏరియా, సీహెచ్‌సీలున్నాయి. ఏరియా ఆస్పత్రుల్లో గైనిక్, పీడియాట్రిక్, జనరల్ సర్జన్, అనస్థీ షియా స్పెషాలిటీ సేవలు ఉన్నాయి. జిల్లా ఆస్పత్రుల్లో దాదాపు అన్ని రకాల స్పెషాలిటీ సేవలు అందిస్తున్నారు. గతేడాదే ఏకంగా 919 స్పెషలిస్టు వైద్య పోస్టులనూ భర్తీ చేశారు. కాబట్టి చాలా రోగాలకు జిల్లా స్థాయిలోనే వైద్యం అందే పరిస్థితి ఉంది. అయినా చాలా కేసులను డాక్టర్లు చూడకుండానే గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, నిమ్స్ వంటి ఆస్పత్రులకు పంపుతుండటంతో రాజధానిలోని ప్రభుత్వ బోధనాస్పత్రులపై ఒత్తిడి పడుతోంది. ఇక నుంచి రోగి క్షేత్రస్థాయిలో ఏదైనా ఆస్పత్రికి వెళితే అక్కడ ఆ రోగికి చికిత్స అందే పరిస్థితి ఉంటే అక్కడే వైద్యం చేయాలి. సీరియస్‌గా ఉండి, వైద్యం అందించలేని పరిస్థితుల్లోనే రిఫర్ చేయాలి. అలాగే వైద్యుల రేషనలైజేషన్ చేయాలని నిర్ణయించి.. వైద్యుల వివరాల జాబితాను కమిషనర్ తెప్పించుకున్నారు.
విదేశాల్లో రిఫరల్ లేకుంటే చేర్చుకోరు..
విదేశాల్లో కిందిస్థాయి ఆస్పత్రిలో చూపించుకున్నాక అక్కడి డాక్టర్ అనుమతితోనే పైస్థాయి ఆస్పత్రిలో చేర్చుకుంటారు. పైస్థాయి ఆస్పత్రికి ఎందుకు రిఫర్ చేస్తున్నారో డాక్టర్ రిఫరల్ కార్డులో వివరంగా రాయాలి. ఇది ఇక్కడ అమలుకావడంలేదు. దీనిపై దృష్టిపెట్టాం. ప్రభుత్వాస్పత్రుల బలోపేతానికి మరో 300 స్పెషలిస్ట్ వైద్యులను నియమించే యోచన చేస్తున్నాం.
– డాక్టర్ రమేశ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment