
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ మోసాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. నకిలీ, బోగస్ ఏజెంట్లకు ముకుతాడు వేసేందుకు ఉన్న నిబంధనలను కఠినతరం చేయాల్సింది పోయి.. మరింత సరళతరం చేసే విచిత్ర నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉపాధి కల్పన, ఉద్యోగాల వలస నియామకాలు చేపట్టే ఓవర్సీస్ మ్యాన్ పవర్ ఏజెన్సీల రిజిస్ట్రేషన్‌ను సునాయాసం చేస్తూ విదేశాంగ శాఖ గురువారం కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త పథకంతో నకిలీ ఏజెంట్లు అధికారికంగా రెచ్చి పోనుండగా.. విదేశాల్లో ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించాలని ఆశపడే నిరుద్యోగులు మరిన్ని మోసాలకు గురయ్యే ప్రమాదముంది. తాజాగా కేంద్రం జారీ చేసిన నిబంధనల ప్రకారం ఏజెన్సీలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే.. ప్రభుత్వానికి కేవలం రూ.8 లక్షలు (బ్యాంకు గ్యారంటీ) డిపాజిట్ చేస్తే సరిపోతుంది. ఇప్పటివరకు రూ.50 లక్షల డిపాజిట్‌తో పాటు మరో రూ.50 లక్షల ఆర్థిక లావాదేవీలుంటేనే రిజిస్ట్రేషన్ చేసుకునే చాన్సుంది. ఇప్పుడు డిపాజిట్ సొమ్మును ఏకంగా ఆరో వంతుకు తగ్గించటంతో కొత్త ఏజెన్సీలు పుట్టగొడుగుల్లా విస్తరించే అవకాశముంది. ఏదైనా పొరపాటు జరిగితే.. తమ డిపాజిట్లను ప్రభుత్వం జప్తు చేసుకొని నిరుద్యోగులకు తిరిగి చెల్లిస్తుందనే భయంతో ఏజెన్సీలు కొంత అప్రమత్తంగా ఉండేవి. రిజిస్ట్రేషన్ ఖరీదైన ప్రక్రియ కావటం, ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రెంట్ వెరిఫికేషన్ లాంటి కఠిన నిబంధనల వల్ల నకిలీ ఏజెంట్లు అడ్డదారులను ఎంచుకునేవారు.
2 లక్షలకు పైగా తెలంగాణ వారు..
తెలంగాణ, ఏపీల నుంచి ఉపాధి కోసం గల్ఫ్‌కు చాలా మంది వెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ వారు దాదాపు 2 లక్షల మందికిపైగా గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. ఏజెంట్లు, నకిలీ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా మోసపోయిన నిరుద్యోగుల సంఖ్య సైతం తెలంగాణ జిల్లాల్లో అధికంగానే ఉంది. ఏటా వందలాది కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఏజెన్సీల రిజిస్ట్రేషన్ విధానాన్ని కేంద్రం సులభతరం చేయటంతో నకిలీ ఏజెంట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయిందనే విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రూ.8 లక్షలతో వచ్చే లైసెన్సు కావడంతో నకిలీలు రెచ్చిపోయే ప్రమాదముంది. ప్రసుత్తం దేశంలో 1,246 మ్యాన్ పవర్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలున్నాయి. తెలంగాణ, ఏపీల్లో 38 ప్రైవేటు, 2 ప్రభుత్వ ఏజెన్సీలున్నాయి.
వంద మందికి ఉద్యోగావకాశం..
రాష్ట్రంలో గల్ఫ్ దేశాల్లో ఉపాధి వీసాలకు కనీసం రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వసూలు చేస్తున్నారు. ఏజెన్సీల డిపాజిట్‌ను తగ్గించటంతో మోసాలు పెరిగే అవకాశముందని పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు. కొత్త పథకం ప్రకారం ఒక్కో ఏజెన్సీకి ఐదేళ్ల పాటు లైసెన్సు అమల్లో ఉండటంతో పాటు వంద మందిని విదేశాలకు పంపించే అవకాశం కల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో మోసాలకు అలవాటు పడ్డ ఏజెన్సీలు ఈ లైసెన్సులను ఎరగా చూపి ఏటా వందలాది మంది నుంచి లక్షలు వసూలు చేసుకొని సొమ్ము చేసుకునే ప్రమాదముంది. 1983లో ఇమిగ్రేషన్ యాక్ట్‌లో భాగంగా ఓవర్సీస్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల రిజిస్ట్రేషన్ లైసెన్సు విధానం అమల్లోకి వచ్చింది. అప్పుడు లక్ష రూపాయల బ్యాంకు గ్యారంటీ డిపాజిట్ ఉండేది. క్రమంగా ఏజెన్సీలు మోసం చేయకుండా కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఈ గ్యారంటీని రూ.50 లక్షల వరకు పెంచుకుంటూ పోయింది.
Comments
Please login to add a commentAdd a comment