
వేగం పుంజుకున్నవిభజన లెక్కలు
- జిల్లా ట్రెజరీ శాఖ ముమ్మర కసరత్తు
- ఉద్యోగుల వివరాల సేకరణలో నిమగ్నం
- ఈ నెల 24తో ఉమ్మడి ఆర్థిక వ్యవస్థకు మంగళం
- అవిభాజ్య రాష్ట్రంలో ఇదే చివరి వేతనం
- అన్ని శాఖల ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లింపులు
- నిధుల వినియోగానికీ చివరి చాన్స్
- వచ్చే నెల నుంచి తెలంగాణ బడ్జెట్‌లో కేటాయింపు
హన్మకొండ, న్యూస్‌లైన్: అవిభాజ్య ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల లెక్కల పుస్తకాలకు కాలం చెల్లనుంది. వచ్చే నెల నుంచి కొత్త రాష్ట్ర బడ్జెట్ అమల్లోకి రానుందని... మే 24 తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లెక్కలు వేర్వే రని... ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాకు సంబంధించిన ఉద్యోగుల వేతనాలు, పెన్షన్‌దారులు పింఛన్లపై నివేదికలివ్వాలని గవర్నర్ నరసింహన్ ఇటీవల జిల్లా గణాంక శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు విభజన లెక్కల ప్రక్రియలో అధికారులు వేగం పెంచారు. ప్రస్తుత ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్‌లో వచ్చిన నిధులు, ఖర్చు, మిగులు నిధులపై నివేదికలు తయారు చేస్తున్నారు. వీటిని ఈనెల 21వ తేదీ లోపు గవర్నర్‌కు సమర్పించనున్నారు. జిల్లాలో మొత్తం 31 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 22వేల మంది పింఛన్‌దారులున్నారు. ఉద్యోగులకు ప్రతి నెలా వేతనాల కింద రూ. 52 కోట్లు.. పెన్షన్‌దారులకు రూ. 35 కోట్లు చెల్లిస్తున్నట్లు జిల్లా గణాంక శాఖ అధికారులు నివేదికల్లో పొందుపరిచారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన నిధులతోపాటు వాటి ఖర్చు వివరాలను పొందుపరిచినట్లు సమాచారం.
24న చివరి సంతకం
ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ చెల్లింపులకు ఈ నెల 24వ తేదీతో తెరపడనుంది. ఇప్పటివరకు చెల్లిస్తున్న వేతనాల రిజస్టర్లు, పే స్లిప్పులన్నీ మారి... నిర్ధేశిత తేదీ తర్వాత అన్ని శాఖల్లో తెలంగాణ రాష్ట్రం పేరుతో పేమెంట్ విధానం అమల్లోకి రానుంది. అపాయింట్‌మెంట్ డే జూన్ 2న నుంచి తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు తీసుకోనుండడంతో ఈనెల 24న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు తీసుకునే వేతనం ఆంధ్రప్రదేశ్‌లో చివరి వేతనంగా చరిత్రకెక్కనుంది. ఈ రోజున ఉద్యోగులు, పెన్షనర్లు పెట్టే సంతకం ఉమ్మడి రాష్ట్రంలో చివరిది కానుంది.
ఉద్యోగుల జాబితా తయారు
లెక్కలతోపాటు జిల్లాలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల జాబితా కూడా సిద్ధమవుతోంది. డివిజన్ల వారీగా స్థానిక, స్థానికేతర ఉద్యోగుల జాబితా తయారీలో అధికారులు కుస్తీ పడుతున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖల్లో ఎక్కడ విధుల్లో చేరారనే ధ్రువీకరణ పత్రాలు, సర్వీసు పుస్తకాలన్నీ సమర్పించాలని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 32 ప్రభుత్వ శాఖల్లో సుమారు 110 మంది అంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులున్నట్లు ఇప్పటివరకు జిల్లా యంత్రాంగం గుర్తించింది.
ఖర్చు కాకపోతే అంతేనా ?
వచ్చే నెల నుంచి ఇక్కడి ఉద్యోగులు, పింఛన్‌దారులకు సంబంధించిన నిధులను తెలంగాణ రాష్ట్రంలో సర్దుబాటు చేయడంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ నుంచి వచ్చిన నిధులు, వాటి ఖర్చుల వివరాలను సమర్పించాలని గవర్నర్ ఆదేశించారు. ఉమ్మడి బడ్జెట్‌లో కేటాయించిన నిధులను ఈనెల 24 వరకు వినియోగించుకోవచ్చని, ఇప్పటివరకు వెచ్చించకుండా ఉన్న నిధులను మాత్రం ఆయా శాఖల ఖాతాల్లో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇక్కడే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వినియోగం కాని నిధులు వెనక్కి పోయే అవకాశముంది. ఈ లెక్కన జిల్లాలో చాలా మేరకు నిధులు ఖాతాల్లో ఉన్నాయి. కార్పొరేషన్, మునిసిపాలిటీ, నగర పంచాయతీలకు ఇటీవలే దాదాపు రూ. 12 కోట్ల అభివృద్ధి నిధులిచ్చారు.
అంతేకాకుండా... గ్రామ పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ. 15 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధుల్లో దాదాపు 30 శాతం కూడా ఖర్చు కాలేదు. వీటిని వెనక్కి తీసుకుని... మళ్లీ ఇస్తారా... అనేది సందిగ్ధంలో పడింది. అయితే వెనక్కి తీసుకునే నిధులను మళ్లీ ఆయా శాఖలకు కొత్త రాష్ట్రంలో మంజూరు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.